మెక్కేశారు

9 Nov, 2013 03:11 IST|Sakshi

సాక్షి, కడప: సమైక్య సమ్మెను ఉపాధి సిబ్బంది సొమ్ము చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కొరవడటంతో అందిన కాడికి దోచుకున్నారు. కూలీలు పనులకు రాకపోయినా వారి పేరుతో దర్జాగా మస్టర్లు తయారుచేసి బొక్కేశారు. బినామీ, బోగస్ పేర్లతో భూమి అభివృద్ధి పనుల పేరుతో అందిన కాడికి దండుకున్నారు. పనులు కల్పించమని కూలీలు  వేడుకున్నా కొన్నిచోట్ల పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు.
 
 జిల్లావ్యాప్తంగా సమ్మెకాలంలో జరిగిన పనులపై దృష్టిసారించి లోతైన విచారణ చేపడితే సిబ్బంది గుట్టురట్టవుతుంది. ఇందిర జలప్రభ క్రింద నాటిన మొక్కలు జిల్లాలో దాదాపు కనుమరుగయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వమే పండ్ల మొక్కల పెంపకంపై  కోత విధించింది. స్మార్ట్‌కార్డులు ఉన్నప్పటికీ లబ్ధిదారులకు మ్యానువల్‌గానే చెల్లింపులు చేసి నిధులను మింగేశారు. చివరకు మరుగుదొడ్లను సైతం వదలకుండా పనులు జరగనప్పటికీ  పే స్లిప్పులు జారీచేశారు.
 
 ‘‘కాశినాయన మండలం గొంటివారిపల్లెకు చెందిన వి.కాశన్న జాబ్‌కార్డు నంబర్ 10065. ఉపాధిహామీ పథకంలో ఇతనికి మరుగుదొడ్డి మంజూరైంది. ఇతను ఏమీ పని చేయకుండానే ఇతని అకౌంట్ పేర రూ.2,238  మంజూరు చేశారు.
 
 కలసపాడు మండలం ఎగువతంబళ్లపల్లె పంచాయతీసింగరాయపల్లె గ్రామానికి చెందిన టి.అన్నపూర్ణమ్మ తన పొలంలో భూమి అభివృద్ధి పని చేయకపోయినా చేసినట్లు వేరే పొలంలో ఆమెను నిలబెట్టి ఫొటో తీసి ఆమె పేరుతో నిధులను స్వాహా చేసినట్లు ఇటీవల సామాజిక తనిఖీల్లో బహిరంగంగా వెల్లడైంది.
 
 బి.మఠం మండలంలో ఒకే పేరును మూడు గ్రూపుల్లో రాసుకుని అతనికి ఒక గ్రూపులో డబ్బు ఇచ్చి, మిగతా రెండు గ్రూపుల్లో వచ్చిన సొమ్మును ఉపాధి సిబ్బంది కాజేసినట్లు ఆరోపణలున్నాయి.
 
 జిల్లాలో ఉపాధిహామీ పథకం తీరు ఇలా..
 జిల్లాలో మొత్తం 818 గ్రామ పంచాయతీల్లో 4,241 హ్యాబిటేషన్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 5,43,149 జాబ్‌కార్డులు, 20,187 గ్రూపులు ఉన్నాయి. సగటున రూ.117.62 వేతనం లభిస్తోంది. 17,605 మంది మాత్రమే ఇప్పటికి 100 పని దినాలను పూర్తి చేసుకోగలిగారు. ఈ ఏడాది మొత్తం 89,53,360  పనిదినాలను కల్పించారు. జిల్లాలో మొత్తం 1,84,607 ఇళ్లు ఉండగా, ఇందులో 48.5శాతం మందికి మాత్రమే పనిని చూపించారు.
 తక్కువ పనిదినాలు కల్పించిన సిబ్బందిపై వేటు :
 623 గ్రామ పంచాయతీల్లో 5వేల పనిదినాలు కల్పించిన సీనియర్ మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. 1000 నుంచి 5000 పనిదినాలు కల్పించిన 97 గ్రామ పంచాయతీల్లోని  28మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సీనియర్ మేట్లుగా రివర్షన్ ఇచ్చారు. 0 నుంచి 1000 పనిదినాలు కల్పించని 56 గ్రామ పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు.
 
 కఠిన చర్యలు తప్పవు :
 మాన్యువల్ పేమెంట్లు లేకుండా పూర్తిగా స్మార్ట్‌కార్డుల ద్వారా డబ్బు పంపిణీ చేసేందుకు కలెక్టర్, జేసీ ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే అందుకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పని దినాలు కల్పించడంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై వేటు వేస్తున్నాం. ఇందులో భాగంగా కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లకు నోటీసులు జారీచేశాం. బి.మఠం మండలం నరసన్నపల్లెలో ఫీల్డ్ అసిస్టెంట్ పేరుతో మస్టర్లు జారీకావడంతో విచారణ లేకుండానే  చర్యలు తీసుకున్నాం.  మరుగుదొడ్ల నిర్మాణంలో  అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై  కఠిన చర్యలు తప్పవు.
 -బాలసుబ్రమణ్యం,
 డ్వామా పీడీ
 
 

మరిన్ని వార్తలు