ఉపాధి పనులకు రూ. 430 కోట్లు

23 Aug, 2014 00:30 IST|Sakshi
ఉపాధి పనులకు రూ. 430 కోట్లు
  •      జిల్లాలో 29 వేల కుటుంబాలకు 100రోజుల పని
  •      20 నర్సరీల్లో టేకు దుంపల పెంపకం
  •      220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
  •      డ్వామా పీడీ శ్రీరాములనాయుడు
  • బుచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఈ ఏడాది ఉపాధి పథకంలో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 430 కోట్లు కేటాయించామని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.198 కోట్లు ఖర్చు చేశామన్నారు. మండలంలోని పాపాయ్యపాలెం పంచాయతీ శివారు బుచ్చన్నపాలెంలో ఏర్పాటు చేసిన టేకు నర్సరీని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నర్సరీలో టేకు దుంపల పెంపకానికి వేసిన బెడ్‌లను పరిశీలించారు. పెంపకానికి సంబంధించి ఎన్ని పని దినాలు కేటాయించారు, ఎంతమంది కూలీలు పనులు చేస్తున్నారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు వేతనాలు పంపిణీ చేయాలని, మస్తర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
     
    220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

    జిల్లాలో 1010 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా 220 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. వీరంతా లక్షా యలు చేరుకోకపోవడం, సోషల్ ఆడిట్‌లో రికవరీల జాబితాలో ఉండడంతో వీరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందాయన్నారు. వారు ఇచ్చే వివరణలను పరిశీలించి తొలగిస్తామన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29 వేల కుటుంబాల వారికి వందరోజులు పని కల్పించామన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మరో 60 వేల కుటుం బాల వారు 75 రోజులు పని పూర్తి చేసుకున్నారన్నారు.
     
    జిల్లాలో 20 టేకు నర్సరీలు
     
    రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు జిల్లాలో 20 టేకు నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో రెండువేల బెడ్‌లను తయారు చేసి 15 లక్షల టేకు దుంపలను పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10లక్షల టేకు మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఇంకా ఐదు లక్షల మొక్కలు అవసరం కాగా అటవీశాఖ వద్ద నాలుగు లక్షలు, విశాఖలో ఒక లక్ష టేకు మొక్కలను కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

    చెక్‌డ్యాంలు, చెరువుల్లో సాగునీటి మదుములకు ఉపాధి హామీలో మరమ్మతులు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇలాంటివి 520 వరకు పనులు గుర్తించామన్నారు. అక్టోబర్ వరకు ఈ పనులు చేపడతామన్నారు. ఇక నుంచి ప్రతి పనికి సంబంధించిన ఫొటో, నిధుల వ్యయం వివరాలను గూగుల్ మ్యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నామని, ఎవరైనా ఈ పనులను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చన్నారు. అదనపు పీడీ ఆనందరావు, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీవో చిన్నారావు, బూరుగుపాలెం సర్పంచ్ రుత్తల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
     
    రూ. 200కోట్లతో నీటి నిల్వ పనులు
     
    నర్సీపట్నం రూరల్ : రూ. 200 కోట్లతో నీటి నిల్వ పను లు చేపట్టనున్నట్టు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, సిబ్బంది, వన సేవకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అటవీ ప్రాంతం దిగువన కందకాల ఏర్పాటు, నీటి నిల్వకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. 1995 తరువాత నిర్మాణం చేసిన చెక్‌డ్యాంలు, నీటి నిల్వ కుంటల పరిస్థితిని అంచనా వేయిస్తున్నట్టు చెప్పారు. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఏడాది 3,800 ఎకరాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఏపీడీలు ఆనందరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు