రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి

2 Dec, 2019 04:12 IST|Sakshi

కెనడాలోని క్యూబెక్‌ ప్రాంతంలోని సంస్థల్లో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఆ దేశ అధికారులతో ఇప్పటికే చర్చించిన రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు యూరప్, యూకే, ఆస్ట్రేలియాల్లోని సంస్థలపైనా దృష్టి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులు డిగ్రీ, తదితర కోర్సులు పూర్తి చేసి.. బయటకు వచ్చీ రాగానే వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. చదువు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగం లేదా ఉపాధి లభించేలా చదువులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు సమావేశాల్లో అధికారులకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత విద్యా శాఖ చర్యలకు ఉపక్రమించింది. యూరప్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధికి వీలుగా ఉన్న మార్గాలపై అక్కడి సంస్థలతో చర్చలు సాగిస్తోంది. కెనడాలోని క్యూబెక్‌ ప్రావిన్స్‌లో అత్యధిక ఉపాధి అవకాశాలు ఉండడంతో అక్కడి అధికారులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపింది.

ఈ సమావేశంలో రాష్ట్ర యువత, విద్యార్థులకు ఇప్పటివరకు ఇచ్చిన నైపుణ్య శిక్షణతోపాటు భవిష్యత్తులో ఇవ్వనున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. క్యూబెక్‌ అధికారుల బృందం రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు మొగ్గు చూపిస్తూ తమ ప్రాధమ్యాలను వెల్లడించింది. ఐటీ, వీడియో గేమింగ్, ఇతర ఇంజనీరింగ్‌ డొమైన్లు, హోటల్‌ మేనేజ్‌మెంట్, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో నైపుణ్యాలున్న వారిని నేరుగా ఉద్యోగాల్లోకి ఎంపిక చేస్తామని తెలిపింది. కెనడాలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న ప్రాంతం క్యూబెక్‌ అని, నైపుణ్యాలున్న యువతకు వివిధ రంగాల్లో 113 రకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని పేర్కొంది. అన్ని రంగాల్లో కలిపి 13 లక్షల ఉద్యోగాలకు ఆస్కారముందని చెప్పింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ రంగాల్లో అత్యధిక ఉద్యోగావకాశాలున్నాయని వివరించింది. 

ఆంగ్లంతోపాటు ఫ్రెంచ్‌ భాషా పరిజ్ఞానం
ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి సాధనకు వీలుగా రాష్ట్రంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆఫర్‌ చేస్తున్న కోర్సుల వివరాలను జేఎన్‌టీయూ–కాకినాడ, జేఎన్‌టీయూ–అనంతపురం, ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీల ప్రతినిధులు క్యూబెక్‌ ప్రతినిధులకు వివరించారు. దీంతో క్యూబెక్‌ ప్రతినిధులు ఏయే రంగాల్లో తమకు మానవవనరుల అవసరముందో రాష్ట్రానికి తెలపనున్నారు. క్యూబెక్‌లోని సంస్థల్లో ఉద్యోగం, ఉపాధి కోరుకునేవారికి ఆంగ్లంతోపాటు ఫ్రెంచ్‌ భాషలో కొంత ప్రావీణ్యం ఉంటే త్వరగా అవకాశాలు దక్కుతాయి. దీంతో రాష్ట్ర యువత, విద్యార్థులకు ఫ్రెంచ్‌ భాషపై శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

క్యూబెక్‌లో డిమాండ్‌ ఉన్న రంగాలు ఇవే..
హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్, బయోఫార్మాçస్యూటికల్, యాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్, టెక్నో హెల్త్, మెడికల్‌ ఎక్విప్‌మెంట్, అప్లైడ్‌ టెక్నాలజీస్, ఆప్టిక్స్‌ ఫొటోనిక్స్, జియోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్‌ ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్‌ ఎమర్జన్సీ ప్రిపేర్డ్‌నెస్, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీ, సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్, వుడ్‌ ప్రాసెసింగ్, గ్రీన్‌ అండ్‌ ఇంటెలిజెంట్‌ బిల్డింగ్స్, ప్లాస్టిక్‌ అండ్‌ కాంపోజిట్‌ మెటీరియల్స్, మెటల్‌ ఫ్యాబ్రికేషన్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, టూరిజమ్‌–కల్చర్, హెరిటేజ్, నేచర్, బిజినెస్‌. 

మరిన్ని వార్తలు