నారాయణ.. నారాయణ!

7 Oct, 2017 02:59 IST|Sakshi

పాల వ్యాపారిగా జీవన ప్రస్థానం

ఐసీడీఎస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం

అంచెలంచెలుగా సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి..

గతంలో టెండర్‌ బాక్స్‌ మాయం?

చర్యలు లేకుండా చక్రం తిప్పిన వైనం

ఏసీబీ కేసులో బెయిల్‌కు సన్నాహాలు

ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.50కోట్లు. జీవితాంతం కష్టపడినా నాలుగు రాళ్లు మిగుల్చుకునేందుకు చిరుద్యోగుల ఎన్నో లెక్కలు వేసుకుంటారు. అలాంటిది.. కోట్లాది రూపాయలు కూడబెట్టిన నారాయణరెడ్డి ఇప్పుడు ఆ స్థాయి ఉద్యోగులతో పాటు జిల్లా అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారారు. అసలు ఎవరీయన? ఈ స్థాయికి  ఎలా ఎదిగారు? మూలాల్లోకి వెళితే.. వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

కదిరి: ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఐసీడీఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ నారాయణరెడ్డి పేరు జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. ధర్మవరం–బత్తలపల్లి మార్గమ««ధ్యంలోని వేల్పుమడుగు ఇతని స్వగ్రామం. పిల్లల పోషణలో భాగంగా 1980లో అనంతపురానికి మకాం మారింది. తపోవనం ప్రాంతంలో నివాసం ఉంటూ సైకిల్‌పై ఇంటింటికీ వెళ్లి పాలమ్మేవాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో కాపురం ఉంటున్న అప్పటి ఐసీడీఎస్‌ పీడీ భగీరథమ్మ(ప్రముఖ రచయిత కొలకనూరి ఇనాక్‌ సతీమణి) ఇంటికీ పాలు పోస్తుండేవాడు. ఆ సందర్భంలో ‘మేడం.. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. పిల్లలను బాగా చదివించాలని అనంతపురానికి చేరుకున్నా. సాయం చేయాలని ప్రతిరోజూ ప్రా«ధేయపడేవాడు. జాలిపడిన ఆమె.. ఐసీడీఎస్‌ శాఖకు అనుబంధంగా ఉన్న సేవాసదన్‌లో గుంతలు తీసి మొక్కలు నాటేందుకు ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించారు. ఆ తర్వాత అటెండర్‌గా.. జూనియర్‌ అసిస్టెంట్‌గా.. ప్రస్తుతం సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగాడు. ఇప్పటికీ ఇతను జిల్లా కేంద్రంలోని కొవూరునగర్, తపోవనం ప్రాంతాల్లో పాలనారాయణరెడ్డిగానే చిరపరిచుతులు. ఒకప్పుడు ఇక్కడే పాలమ్మేవాడు.. రూ.కోట్లు ఎలా సంపాదించాడని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు.

ఆ ఫైల్‌ను మాయం చేశారట..
అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే టెండర్‌కు సంబంధించిన టెండర్‌ బాక్స్‌ను పై అధికారులకు తెలియకుండా నారాయణరెడ్డి గోల్‌మాల్‌ చేస్తున్నట్లు గ్రహించిన అప్పటి ఏజేసీ చెన్నకేశవరావు ఇతన్ని సస్పెండ్‌ చేశారు. విచారణ చేపట్టాలని అప్పట్లో ఆదేశించారు. ఆ బాధ్యతలను అప్పటి బీసీ కార్పొరేషన్‌ ఈడీ, ప్రస్తుత ఐసీడీఎస్‌ పీడీ అయిన వెంకటేశంకు ఆ ఫైల్‌ను అప్పగించండని అప్పటి పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. అయితే నారాయణరెడ్డి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫైల్‌ వెంకటేశంకు చేరకుండా జాగ్రత్త పడ్డారు. తనకున్న పలుకుబడితో మళ్లీ మూడు రోజుల్లోనే సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నట్లు తెలిసింది. అలాగే తనపై ఆ రోజు ఏజేసీ విచారణకు ఆదేశించిన ఫైల్‌నే మాయం చేశారనే చర్చ జరుగుతోంది.

పెద్ద మోసగానివే!
నారాయణరెడ్డి ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ పెద్ద మెసగానివే అని ఏసీబీ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ జయరామరాజు అన్నట్లు తెలుస్తోంది. ఆ మాట ఎందుకన్నారంటే.. జీసెస్‌ నగర్‌లో ఓ దళిత మహిళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని ఆమెకు సంబంధించిన రూ.22.50 లక్షల విలువ చేసే 3 సెంట్ల స్థలాన్ని కేవలం రూ.10 లక్షలు ఇచ్చి తన పేరిట రాయించుకున్నట్లు సమాచారం. అయితే అగ్రిమెంట్‌ పత్రాల్లో మాత్రం రూ.22.50 లక్షలని కనబర్చినట్లు తెలిసింది. కాకపాతే.. ఆ తర్వాత స్థలం విలువ కేవలం రూ.5 లక్షలని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం గమనార్హం. అగ్రిమెంట్‌లో అలా.. రిజిస్ట్రేషన్‌లో ఇలా.. అంటూ పెద్ద మెసగానివే.. అని డీఎస్పీ అన్నట్లు విశ్వసనీయ సమాచారం.

బెయిల్‌కు సన్నాహాలు
ఏసీబీకి పట్టుబడిన నారాయణరెడ్డి అప్పుడే ఏసీబీ కోర్టు నుంచి బెయిల్‌ తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నారాయణరెడ్డి రూ.2.30 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చూపారని, ఇప్పటికే ఆయన ఆ డబ్బుకు లెక్కాచారాలు సిద్ధం చేసినట్లు సమాచారం. తాను అక్రమంగా సంపాదించలేదని, తనది సక్రమ సంపాదనేనని.. బెయిల్‌ మంజూరు చేయాలని శుక్రవారం ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు