ఉప్పొంగిన ఉత్తేజం

13 Jun, 2015 00:21 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ముఖ్య నేతల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. రాష్ట్రంలో తొలిసారి పార్టీ జిల్లా కమిటీతో పాటు, రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలందరితో ఒకేసారి ప్రమాణస్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించిన ప్రత్యేకత తూర్పు గోదావరి జిల్లాకు దక్కింది. కాకినాడ సూర్యకళామందిరంలో శుక్రవారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం, పార్టీ పదవులు పొందిన వారికి నియామకపత్రాలు, గుర్తింపుకార్డులు అందచేసే కార్యక్రమం  ఆద్యంతం పండుగను తలపించి కేడర్‌కు దిశ, దశ నిర్దేశించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ బాధ్యతలు స్వీకరించాక ఏడెనిమిది నెలల కసరత్తు అనంతరం పూర్తి స్థాయి జిల్లా కమిటీకి తుది రూపమిచ్చారు.
 
 రాష్ట్ర కమిటీ,  అనుబంధ కమిటీలు, జిల్లా, అనుబంధ కమిటీలకు ఎంపికైన సుమారు 500 మందికి ఒకే వేదికపై నుంచి నియామకపత్రాలు, గుర్తింపు కార్డులు ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదని ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి జ్యోతులను అభినందించారు. జిల్లా నాయకత్వం క్రమశిక్షణాయుతంగా ఇంతటి కార్యక్రమంతో తూర్పు గోదావరిలో రగిల్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునేలా అన్ని జిల్లాలకూ సమాచారం ఇస్తామని ఆయన అనడం జిల్లాకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ముఖ్యనేతలు ఎవరికి వారు భిన్నమైన ప్రసంగాలతో పార్టీ శ్రేణులకు భవిష్యత్‌పై భరోసాను కల్పించారు. అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసిన ‘ఓటుకు నోటు’ వ్యవహారానికి సంబంధించిన నాయకుల విమర్శలతోవైఎస్సార్ సీపీ  శ్రేణుల  ఉత్సాహం ఇనుమడించింది.
 
 ఉర్రూతలూగించిన అంబటి
 ప్రసంగం ఆద్యంతం తన సహజశైలితో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు శ్రేణులను ఉర్రూతలూగించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం గురించి, ఏడాది పాలనలో అవినీతి గురించి ఆయన చెప్పిన పిట్టకథలు, సూక్తులు కేడర్‌ను ఉత్తేజ పరిచాయి. ఏడాది కాలంలోనే టీడీపీ పాలనకు ఐదేళ్లు నిండిపోయాయనడం, దొంగ పారిపోతూ పొగగొట్టంలో ఇరుక్కుపోయినట్టు చంద్రబాబు దొంగగా ఇరుక్కుని బయటకు రాలేక, లోపల ఉండలేక కొట్టుమిట్టాడుతున్నారనడం, ఇలాంటి ఉపమానాలు అడుగడుగునా పార్టీ శ్రేణులతో కేరింతలు కొట్టించాయి.
 
 అవగాహన కల్పించిన ధర్మాన
 పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం, ప్రధాన ప్రతిపక్షంగా అధికారపార్టీలో లోటుపాట్లను ఎత్తిచూపేందుకు మానవహక్కుల సంఘాలు, ఏసీబీ, సీబీఐ, విజిలెన్స్ వంటి సంస్థలను వినియోగించుకుంటూ ప్రజలకు చేరువకావాలంటూ మరో ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఇందుకు అధ్యయనం కూడా అవసరమంటూ, అందరిపైనా గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రతిపక్షంగా సరిగ్గా పనిచేసినప్పుడు అధికారం ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో కలుగుతుందని చెబుతూ వారి బాధలు తమవిగా భావించాలని సూచించారు. పదవుల పంపకాల్లో పెద్దా, చిన్నా తారతమ్యమనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, నాయకత్వం తీసుకున్న వారికి ఓపిక, సహనం, అధ్యయనం అవసరమన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు,  జలయజ్ఞంతో పేదలకు, రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించిన విజయసాయిరెడ్డి అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట కూడా నిటబెట్టుకోలేకపోయిన వైనాన్ని ఎత్తిచూపినప్పుడు ‘వైఎస్ అమర్హ్రే, జగన్ జిందాబాద్’ అంటూ కేడర్ చేసిన నినాదాలతో హాలు మార్మోగింది.
 
 కడవరకూ క్రమశిక్షణ పాటించిన కేడర్
 పార్టీ పదవులు పొందిన ప్రతి నేతకూ చివరి వరకు ఓపికగా విజయసాయిరెడ్డి నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు స్వయంగా అందచేయడం, పేరు, పేరునా అందరినీ నెహ్రూ వేదికపైకి పిలవడం కేడర్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్య నేతలు ముగ్గురూ తమదైన ప్రసంగాలతో రాబోయే కాలం మనదేననే ధైర్యాన్ని నింపగలిగారు. ప్రారంభంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూ చెప్పిన దానికి చివరి వరకు కట్టుబడి కేడర్ మొత్తం క్రమశిక్షణతో కూడిన సైనికుల్లా నిలబడటంతో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా నలుచెరగుల నుంచి తరలివచ్చిన పార్టీ కేడర్, అభిమానులతో సమావేశానికి వేదికైన సూర్యకళామందిరం కిక్కిరిసింది. హాలులో వేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో అంతకు రెట్టింపు సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బయటే ఉండిపోవాల్సి వచ్చినా ఓపికగా  సమావేశం చివరి వరకు కదలకుండా కనిపించారు. పార్టీ పట్ల, నేతల పట్ల కేడర్‌లో ఉన్న నమ్మకానికి ఒక చక్కటి నిదర్శనంగా ప్రమాణస్వీకారోత్సవం నిలిచిందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గత వారం రోజులుగా సమన్వయంతో చేసిన కృషి సమావేశం విజయవంతం కావడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిందనే సంతృప్తి మిగిల్చిందని నెహ్రూ అభిప్రాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు