‘మలి విడత’ ప్రచారం నేటితో సమాప్తం

9 Apr, 2014 04:08 IST|Sakshi

విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : మలి విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. 11న జరిగే రెండోవిడత ఎన్నికలకు బుధవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారాలకు బ్రేక్ పడనుంది. దీంతో అభ్యర్థులు ఓటర్లను తమ వైపునకు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఈ విడతలో ఏజెన్సీ 11 మండలాలు పాడేరు, ముంచింగ్‌పుట్, జి.కె.వీధి, చింతపల్లి, డుంబ్రిగుడ, అనంతగిరి, అరకు వ్యాలీ, కొయ్యూరు, హుకుంపేట, పెదబయలు, జి.మాడుగుల స్థానాలతో పాటు ట్రైబల్ సబ్‌ప్లాన్ మండలాలైన నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, వి.మాడుగుల, దేవరాపల్లి మండలాలు మొత్తం 17 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 277 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ పెదబయలు మండలంలో జామిగూడ,ఇంజరి సెగ్మెంట్లకు నామినేషన్లు పడలేదు.  దేవరాపల్లి మండలంలో ఎ.కొత్తపల్లి, చింతపల్లి మండలంలో బలపం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
 
దీంతో 273 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1067 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. 6,84,825 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 794 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
 
ప్రచార సందడి
ఏజెన్సీలో చిన్న చిన్న తండాల్లో సైతం ఎన్నికల ప్రచార సందడి కనిపిస్తోంది. పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. మొదటి దశ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర పార్టీలు కూడా ఒకటి రెండు స్థానాలకే పరిమితమయ్యాయి.  రెండో దశ ఎన్నికల్లో ఏజెన్సీ స్థానాల్లో 5 నుంచి 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
 
ఈ స్థానాలకు అన్ని పార్టీలు అభ్యర్థులను నిలబెట్టడంతో పాటు స్థానిక బలంతో కొంత మంది స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ సారి ఏజెన్సీలో సైతం ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
 
నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకోడానికి రంగంలోకి దూకారు. ఒకవైపు ఈ స్థానిక ఎన్నికలపైనే కాకుండా సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా క్యాంపేన్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలో కూడా స్థానిక పోరు రసవత్తరంగా మారింది.

మరిన్ని వార్తలు