ప్రేమ.. విషాదం

6 Nov, 2013 03:04 IST|Sakshi

హుస్నాబాద్, న్యూస్‌లైన్ : ప్రేమ వ్యవహారం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండు నిండుప్రాణాలను బలిగొన్నది. ప్రియుడు మోసం చేశాడనే కారణంతో కుమార్తె మృతి చెందగా, ఆమె మృతిపై అనుమానాలు రావడంతో తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హుస్నాబాద్ మండలం గౌరవెళ్లి గ్రామానికి చెందిన ఎండీ.షర్పొద్దీన్ భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామకార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన నాల్గవ కుమార్తె షెష్మా(18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే గ్రా మానికి చెందిన ఓ యువకుడు, షెష్మా ప్రేమించుకున్నారని సమాచారం.
 
 ఈనెల ఒకటిన షెష్మా ఇంట్లో మృతి చెందగా, కుమార్తె మరణం తట్టుకోలేక ఆమె తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గౌరవెళ్లికి చెందిన ఓ యువకుడు షెష్మాను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని, దీంతో ఆమె క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి షర్పొద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షెష్మా మృతదేహానికి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె క్రిమిసంహారక మందు తాగి చనిపోలేదని, శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని పోలీసులకు నివేదిక ఇచ్చారు.
 
 ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న షెష్మా గాయాలపాలు కావడంపై పోలీసులు అనుమానించారు. ఆమె శరీరంలోని పలు భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. షెష్మా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతరత్రా ఏమైనా జరిగిందా.. అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టడంతోపాటు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. షెష్మా ప్రేమ వ్యవహారంతోపాటు ఆమె మృతిపై పదిమందిలో పలు రకాలుగా చర్చ సాగడం ఆ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేసింది. దీంతో మనస్తాపం చెందిన షర్పొద్దీన్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె మరణంతో మనోవేదకు గురై షర్పొద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య రమిజా ఫిర్యాదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ తెలిపారు.
 
 షెష్మా మృతిపై అనుమానాలున్నాయి..
 షెష్మా మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, ఆమె క్రిమిసంహారక మందు తాగలేదని, శరీరంపై మూడు చోట్ల గాయాలున్నాయని పోస్టుమార్టంలో తేలిందని సీఐ సదన్‌కుమార్ తెలిపారు. దీంతో గాయాలున్న ఆమె శరీర భాగాలను ఫోరెన్సిన్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే షెష్మా మృతిపై వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. షర్పొద్దీన్ మృతిపై గ్రామస్తులను విచారించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు