రామ..రామ...ఇదేమి కర్మ..

21 Apr, 2016 01:01 IST|Sakshi

మాన్యాలు ఉన్నా అప్పుల కుప్పలు 
78 ఎకరాలున్నా  జీతాలకూ డబ్బుల్లేవు
నిర్వహణకు అప్పులు  పట్టించుకోని  దేవాదాయ     శాఖ అధికారులు

 

ఆనాడు రామదాసు భక్తుల నుంచి విరాళాలు సేకరించి భద్రాద్రి రాముడికి గుడి కట్టి భక్తరామదాసుగా కీర్తినార్జించారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన మోటూరు రాముడికి ఆస్తులున్నా ఆలయ నిర్వహణకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కోట్ల ఆస్తులున్నా సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంపై ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

గుడివాడ రూరల్:  మండలంలోని మోటారు గోదాపురంలోని శ్రీసీతారామస్వామి అపర భద్రాద్రిగా ఖ్యాతినార్జించింది. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి తరలివస్తారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.

 
ఆలయానికి 78.20 ఎకరాల భూమి

శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వంశానికి చెందిన తిరుమాలచార్యులు, శ్రీనివాసాచార్యులకు కలలో స్వామి కనిపించి గన్నవరం గ్రామ భూగర్భంలో ఉన్నానని సెలవిచ్చారు. స్వామి చెప్పిన విధంగా అక్కడ తవ్వించగా సీతారాముల విగ్రహాలు లభించాయి. వాటిని తీసుకువచ్చి మోటూరులో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆ వంశస్తులు స్వామివారి దూప, దీప, నైవేద్యాల కోసం కొంత భూమికి కూడా ఆలయానికి రాసి ఇచ్చారు. ప్రస్తుతం దేవస్థానం ఆధ్వర్యంలో మోటూరు, దొండపాడు, పెదపాలపర్రు, కుదరవల్లి, విస్సాకోడేరు, కొత్తూరు, పెంజెండ్ర, గుంటాకోడూరు, అమినాబాద్, పశినేదాల, అన్నంగి గ్రామాల్లో  78.20 ఎకరాల భూమి ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఉన్నా స్వామి సేవలు, ఉత్సవాలు, ఆలయ నిర్వహణ కష్టంగా మారిందని ఆలయ ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు.


నిర్వహణకు అష్టకష్టాలు
ఈ ఏడాది సాగునీరు లేకపోవడంతో దేవస్థానానికి చెందిన 35 ఎకరాలు సాగు చేయకుండా వదిలేశారు. సాగు చేసిన భూముల రైతులు కూడా కౌలు చెల్లించలేదు. గుంటాకోడూరులో చుట్టూ చేపల చెరువులు ఉండడంతో 5.19 ఎకరాలు భూమి రెండు దశాబ్దాలుగా సాగు చేపట్టలేదు.  వీటిని చేపల చెరువుగా మార్చేందుకు కొంతకాలం ప్రయత్నించి వదిలేశారు. దీంతో ఆలయ భూములకు అరకొర ఆదాయం మాత్రమే వస్తుండడంతో ఆలయ నిర్వహణ భారంగా మారింది. అర్చకులకు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విజయవాడ దుర్గగుడి నుంచి ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడంతో కొంతమేర సిబ్బందికి జీతాలు చెల్లించారు.  ఇంకా కొన్ని నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయ నిర్వహణ పెనుభారంగా మారనుంది. ఆలయ భూముల్లో పది ఎకరాలు అమ్మి వచ్చిన సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ వేసి దానిపై వడ్డీతో ఆలయ నిర్వహణ చేయవచ్చని అధికారులు ఆలోచించారు. ఇందుకు గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయాన్ని పెద్ద దేవాలయాలకు దత్తత ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆలయ ధర్మకర్తలు, భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపకుడు, శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ న.చ.రఘునాథాచార్యస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆలయ సమస్యపై వినతిపత్రం అందజేశారు.

 

ప్రస్తుత  ఆదాయం రూ.తొమ్మిది లక్షలు
ప్రస్తుతం ఎకరాకు 12 నుంచి 14 బస్తాలు కౌలు ఇస్తున్నారు. ఈ భూములపై ఆదాయం సుమారు రూ.తొమ్మిది లక్షలు వస్తుంది. ఇందులో రూ.ఐదు లక్షలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మిగిలిన సొమ్ము ఆలయ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు వినియోగిస్తున్నాం.               - ఎస్.కె. కిషోర్, ఆలయ ఈవో

>
మరిన్ని వార్తలు