మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం

15 Mar, 2020 04:08 IST|Sakshi

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ 

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చర్యలు

వారం రోజుల్లో రూ.1.84 కోట్ల నగదు సీజ్‌

అక్రమాలపై 14500, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు  

సాక్షి, అమరావతి: మద్యం, డబ్బు పంపిణీ ప్రసక్తే లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న ప్రభుత్వ ఆశయాన్ని సాధించడానికి పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హులు అవుతారంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్‌ తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా వారం రోజులుగా తీసుకుంటున్న చర్యలను వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వెల్లడించారు.  
- ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలు లేకుండా దాడులు ముమ్మరం చేశాం. ఏపీ పోలీస్‌ శాఖకు చెందిన 10 వేల మంది పోలీసులు, ఎక్సైజ్‌ శాఖకు చెందిన 4 వేల మంది సిబ్బంది ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ‘ఆపరేషన్‌ సురా’లో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేశాం.  
- గత వారం రోజుల్లో 2,752 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాం. 5,005 లీటర్ల నాటుసారా, 2 లక్షల లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన ఊటను ధ్వంసం చేశాం. 3,072 కిలోల గంజాయి, 30,028 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం. 1,605 కేసులు నమోదు చేసి 1,562 మందిని అరెస్టు చేశాం. 145 వాహనాలు సీజ్‌ చేశాం.  
- ఎన్నికల కోసం తరలిస్తున్న నగదు రూ.1,84,84,800, బంగారం 2.551గ్రాములు(విలువ రూ.1,40,34,021), వెండి 50.558గ్రాములు(విలువ రూ.18,16,920), 87 చీరలు, 3 ల్యాప్‌టాప్‌లు, 140 సంచుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. 
- రాష్ట్రంలో 701 పోలీస్‌ మొబైల్‌ చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటితోపాటు 62 ప్రత్యేక మొబైల్‌ చెక్‌పోస్టులు, 18 బోర్డర్‌(రాష్ట్ర సరిహద్దు) చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం.  
- మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమాలపై టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500, డయల్‌ 100, 112లతోపాటు జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో సమాచారం ఇవ్వొచ్చు.   

మరిన్ని వార్తలు