ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ

14 Aug, 2013 04:33 IST|Sakshi

 * ఈనెల 19 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
 *  22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు..
 *  సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆప్షన్ల సవరణకు అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్(ఎంపీసీ విభాగం) విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ తెలిపారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ  వరకు ఆప్షన్ల నమోదు జరుగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

విద్యార్థులు ర్యాంకును అనుసరించి హెల్ప్‌లైన్ సెంటర్ల లో విధిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని, అధికారులు అందజేసే స్క్రాచ్ కార్డును భద్రపరుచుకుని వెబ్ ఆప్షన్ల నమోదుకు వినియోగించుకోవాలని సూచించారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఉదయం 9 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్‌కు చేరుకోవాలి. స్పెషల్ కేటగిరీ కింద వికలాంగ, సైనికుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో ఉంటుంది.

సంబంధిత షెడ్యూలును  https://apeamcet.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కళాశాలల వారీగా ఫీజుల వివరాలను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కళాశాలలో ఫీజు, చెల్లించగలిగే స్తోమత, ఫీజు రీయింబర్స్‌మెంట్ లభించే అవకాశం తదితర అంశాలను పరిశీలించి మెరుగైన కళాశాలను ఎంచుకోవాలి.
 

యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో బీ-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం యాజమాన్యాలు బీ-కేటగిరీ దరఖాస్తులను కళాశాల నోటీసు బోర్డులో, వెబ్‌సైట్లో ఉంచాలని, తమకు, సంబంధిత వర్సిటీకి దరఖాస్తు ఫారం నమూనాను ఈ-మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొంది. విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తును రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని సూచించింది. కళాశాలలు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనూ స్వీకరించవచ్చని, వాటి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించింది. కాగా, ప్రతిభాక్రమంలో ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్‌కు పంపించాల్సి ఉంటుంది. జాబితాను రెండు వారాల పాటు వెబ్‌సైట్‌లో ఉంచాలి.

మరిన్ని వార్తలు