‘సైకిల్‌’తో అమెరికాకు!

4 Nov, 2018 09:40 IST|Sakshi

తోట్లవల్లూరు విద్యార్థికి అరుదైన అవకాశం

ఆటోమేటిక్‌చార్జి సైకిల్‌ రూపకల్పన

బోస్టన్‌ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం

కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అన్న ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సూక్తిని అందిపుచ్చుకున్నాడు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి. సామాన్యుల కోసం ఏదైనా చేయాలనే అతడి ఆలోచన విద్యుత్, పెట్రోల్, డీజిల్‌  అవసరం లేకుండా నడిచే ఆటోమేటిక్‌ చార్జి సైకిల్‌ రూపకల్పనకు దోహదం చేసింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిచే  సైకిల్‌ తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. బోస్టన్‌ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు తన ప్రతిభను ప్రదర్శించేందుకు అమెరికా పయనమయ్యాడు. అతడే తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి నాగశ్రీపవన్‌.

కృష్ణా జిల్లా/ తోట్లవల్లూరు: తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి రమేష్‌బాబు, నాగవెంకట హనుమలత దంపతుల కుమారుడు కంభంపాటి నాగశ్రీపవన్‌. కంచికచర్ల సమీపంలోని దేవినేని వెంకటరమణ, హిమశేఖర్‌ మిక్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ చేస్తున్నాడు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో పేదలు, సామాన్యుల కోసం ఖర్చు లేకుండా ప్రయాణించే ఆటోమేటిక్‌  చార్జి సైకిల్‌ను రూపొందించాడు. కళాశాల మెకానికల్‌ యాజమాన్యం, అధ్యాపక బృందం, ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ సహకారంతో సైకిల్‌ను రూపొందించినట్లు నాగశ్రీపవన్‌ తెలియజేశాడు.

అమెరికా పయనం..
ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ ద్వారా నాగశ్రీపవన్‌కు అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అతను రూపొందించిన ఆటోమేటిక్‌ చార్జి సైకిల్‌ గురించి వివరించటానికి ఈ నెల 4 నుంచి 16వ తేదీ మధ్యలో సైకిల్‌తో సహా రావాలని యూనివర్సిటీ కోరింది. దీంతో పవన్‌ శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధువుల వీడ్కోలు నడుమ అమెరికా పయనమయ్యాడు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఓ ప్రత్యేక పరికరం తయారు చేయటం, దానిని ప్రదర్శించేందుకు అమెరికా వెళుతుండటంపై గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

సామాన్యుల సైకిల్‌
రైతులు, పేదల కోసం ఏదో ఒకటి రూపొందించాలనే ఆలోచన నుంచి  పుట్టిందే ఆటోమేటిక్‌ చార్జి సైకిల్‌. దీని తయారీకి రూ.20 వేల వరకు వ్యయమవుతుంది. గంటకు 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పెట్రోల్, డీజిల్, విద్యుత్‌ అవసరం లేదు. సైకిల్‌ నడుస్తుండగానే చార్జి అవుతూ ప్రయాణిస్తుంది. 150 కేజీల వరకు బరువు మోయగలిగే సామర్థ్యంతో దీనిని మరింత అధునాతంగా రూపకల్పన చేసేందుకు కృషి చేస్తున్నాను. సైకిల్‌ రూపకల్పనకు సహకరించిన మిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధీర్‌బాబు, మెకానికల్‌ హెచ్‌వోడీ, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు.
–కంభంపాటి నాగశ్రీపవన్, 
ఇంజినీరింగ్‌ విద్యార్థి, తోట్లవల్లూరు 

మరిన్ని వార్తలు