ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

6 Feb, 2014 02:03 IST|Sakshi
చేబ్రోలు, న్యూస్‌లైన్ :పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనే మనస్థాపంతో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం సంచలనం కలిగించింది. బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన అన్నం వెంకటమణినాగసాయిశంకర్(18) రైలు కిందపడి మృతిచెందాడు. అప్పికట్ల గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి అన్నం సాంబశివరావు, ఝాన్సి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం, రెండో కుమారుడు సాయిశంకర్ అగ్రికల్చర్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. 
 
 ఆశించినస్థాయిలో ఫలితాలు రాకపోవడంతో సాయిశంకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇదే విషయాన్ని అప్పికట్లలో ఉంటున్న కుటుం బ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. హస్టల్‌లో ఉంటున్న సాయిశంకర్ మంగళవారం రా త్రి శలపాడు రైల్వే పట్టాలపైకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రైల్వే సిబ్బంది గమనించి మృతుడి ఐడెంటీ కార్డు ఆధారంగా కళాశాల సిబ్బందికి, కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. గుంటూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి.రాజశేఖరబాబు.. సాయిశంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుం బసభ్యులకు అందజేశారు. చేబ్రోలు ఎస్‌ఐ రవిబాబు సంఘటనాస్థలానికి చేరుకొని, కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను  సేకరించారు.
 
 శోకసంద్రంగా మారిన అప్పికట్ల
 అప్పికట్ల (బాపట్ల): ‘అమ్మా పరీక్షల్లో నాలుగు సబ్జెక్టులు ఫెయిలయ్యాను.. నాకు చాలా బాధగా ఉంది.. అని చెప్పడంతో.. తప్పినా ఫర్వాలేదు ఇంటికి వచ్చేయ్‌నాన్నా.. అంటూ ఫోన్‌లో చెప్పా.. ఇంతలోనే దారుణం జరిగిపోయింది’ అంటూ ఆ తల్లి తల్లడిల్లిపోయింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాయిశంకర్ మృతదేహాన్ని చాపలో చుట్టి తీసుకురావడంతో అప్పికట్ల ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. మొదటి సెమిస్టర్‌లో  నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో  మనస్తాపానికి గురైన సాయిశంకర్ మంగళవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల వరకు ఫోన్‌లో మాట్లాడి సెల్‌ఫోన్ స్వీచ్ ఆఫ్‌చేయడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు, స్నేహితులు కళాశాల ప్రాంతం మొత్తం గాలింపుచర్యలు చేపట్టారు.  బుధవారం ఉదయం విషయం తెలిసి అక్కడికి వెళ్లి చూస్తే గుర్తింపు కార్డులు ఆధారంగా సాయినేనని గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పికట్లకు తీసుకువచ్చారు.
 
 విలపించిన స్నేహితులు
  నిన్నటి వరకు తమతోపాటు సరదాగా గడిపిన సాయి చనిపోయాడనే వార్త తెలుసుకుని తోటి విద్యార్థులు అప్పికట్లకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎప్పుడు సరదాగా చలాకీగాఉండే సాయి ఆత్మహత్యకు పాల్పడడాన్నినమ్మలేకపోతున్నామంటూ రోదించారు. 
 
మరిన్ని వార్తలు