మానవ రహిత రైల్వే గేటు బాగు

28 Mar, 2018 09:37 IST|Sakshi
మానవ రహిత రైలు గేటు పనితీరును ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావుకు వివరిస్తున్న విద్యార్థులు

రూపొందించిన వాసవిఇంజినీరింగ్‌ విద్యార్థులు  

పెడన : నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు. తాజాగా మానవ రహిత రైల్వే గేటును రూపొందించి ఆహో అనిపించారు. కళాశాలలో ఈఈఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ గేటు నమూనాను రూపొందించి కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఏబీ శ్రీనివాసరావు, హెచ్‌ఓడీ జ్యోతిలాల్‌ నాయక్‌ ఎదుట ప్రదర్శించారు.  

పరికరాలు.. పనితీరు..
మానవ రహిత రైల్వే గేటుకు ఆర్డీనో ఎలక్ట్రానిక్‌ పరికరం, ట్రాన్స్‌ఫార్మర్, బ్రిడ్జి రెక్టిఫైర్, కెపాసిటర్, అయస్కాంతాల సెన్సార్, సర్వే మీటరు, ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించనున్నారు. ఆర్డీనో పరికరం ద్వారా రైల్వే గేటు నియంత్రణకు ఉపయోగిస్తారు. రైలు వచ్చే సమయంలో గేటు మూసుకోవడం, రైలు వెళ్లగానే తెరుచుకునేలా  ఈ పరికరం ఉపయోగపడుతుంది.  ట్రాన్స్‌ఫార్మర్‌ విద్యుత్‌ను అందిస్తుంది. బ్రిడ్జి రెక్టిఫైర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వచ్చే విద్యుత్‌ను  తీసుకుని సమాంతర డీసీలోని 5 ఓల్టు  విద్యుత్‌గా తగ్గించి అందిస్తుంది. ఇందుకు కెపాసిటర్‌ను వినియోగించారు. అయస్కాంత సెన్సార్లు రైలు వచ్చిన సమాచారాన్ని ఆర్డీనోకు సందేశాన్ని పంపిస్తుంది. ఎల్‌ఈడీ లైట్లను ఈ సెన్సార్లకు అనుసంధానం చేయడంతో అవి వెలిగేలా చర్యలు చేపట్టారు. 

ఉపయోగాలు
మానవ రహిత రైల్వే గేటు వల్ల మానవ లోపాలు జరిగే నష్టాలను అరికట్టవచ్చు. రైలు రాకపోకల్లో జాప్యం జరిగినా ఎటువంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదు. సుదూర ప్రాంతాల్లో గేట్‌ కీపర్‌ ఒక్కడే ఉండాలంటే భయపడే పరిస్థితులు. ఇటువంటి చోట్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని అతివేగంగా ఆపరేట్‌ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 

కనుగొన్నది వీరే..
వాసవిలో ట్రిపుల్‌ ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎ.మాధవితేజ, ఎం.హారిక, వి.చరణ్‌సాయి, ఎన్‌.సాయికొండ, ఏహెచ్‌వీ ప్రసాద్‌. ఐదు నెలలు పాటు శ్రమించి దీనిని రూపొందించారు.

చదువుతోపాటు ప్రయోగాలు ముఖ్యమనే ఉద్దేశంతో.
విద్యార్థులు చదువుతో పాటు ఏదైనా కొత్త తరహా ప్రయోగం చేస్తేనే గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో విద్యార్థుల ఆలోచనకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ఇందుకు హెచ్‌ఓడీ జ్యోతిలాల్‌ నాయక్‌ ఆధ్వర్యంలో కళాశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులు  ఈ ప్రయోగంలో విజయం సాధించడం చాలా అభినందనీయం. – కేవీవీఎన్‌ భాస్కర్,ప్రాజెక్టు గైడ్‌

>
మరిన్ని వార్తలు