స్మార్ట్, మెగాసిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలక బాధ్యత

16 Sep, 2014 03:30 IST|Sakshi

మార్కాపురం: నవ్యాంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోయే 14 స్మార్ట్, 3 మెగా సిటీల నిర్మాణంలో ఇంజినీర్లదే కీలకబాధ్యత అని, భవిష్యత్‌లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజినీర్స్ డే నిర్వహించారు.

 ఈ సందర్భంగా కళాశాలలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టాలు మన రాష్ట్రానికే ఎక్కువ జరిగాయన్నారు. ఇంజినీర్‌గా రాణించాలంటే ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యం ఉండాలన్నారు. ఇంజినీరింగ్ విద్యలో వస్తున్న అధునాతన మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.  

వెలిగొండ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులు వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని, స్థాయికి తగిన ఉద్యోగాన్ని ఎంచుకోవాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ కష్టపడేతత్వం, పరిశోధన, తపన ఉంటే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.

 ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వరరావు, ప్రొఫెసర్లు మస్తానయ్య, మురళీకృష్ణ, సుబ్బారెడ్డి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఈఈ రాఘవరెడ్డిని, డీఈ శ్రీనివాసమూర్తిని ఎమ్మెల్యే సురేష్ ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు