అందరికీ ఆంగ్ల బోధన

16 Jun, 2018 11:42 IST|Sakshi
ఇంగ్లిష్‌ మీడియం బోధనకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల

ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది నుంచే ప్రారంభం

జిల్లాలోని 628 పాఠశాలల్లో అమలు

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

బేస్తవారిపేట: అందరికీ ఆంగ్ల బోధన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. 2018–19 జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలల్లో ఆంగ్లబోధనకు శ్రీకారం చుట్టింది. తొలివిడతలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థుల ఆసక్తి... ఉపాధ్యాయుల బోధన... పాఠశాలల్లోని మౌలిక వసతులు తదితర వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో ఫేజ్‌–1లో 374, ఫేజ్‌–2లో 254 పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు.

ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు మీడియం విద్య...
  పాఠశాల పునః ప్రారంభం నుంచి ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రారంభించారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమాన్ని బోధిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రతి ఒక్కరికీ ఉచితంగా బోధించాలని నిర్ణయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఉపాధ్యాయుల ప్రచారం...
ఇంగ్లీషు మీడియం విద్యా బోధనను ప్రారంభించే గ్రామాల్లోని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆంగ్ల బోధనతో కలిగే ప్రయోజనాలు, విద్యార్థుల ఆసక్తి, ఆంగ్లంపై ఇష్టంలేనివారికి తెలుగు మీడియంలోనూ బోధించే వెసులు బాటు ఉందని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. రూ. వేలకు వేలు ఖర్చుపెట్టి ప్త్రెవేట్‌ బడులకు తమ పిల్లలను పంపితే ప్రయోజనం ఉండదని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత కల్గిన ఉపాధ్యాయులతో ఆసక్తికరమైన బోధన ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు