ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులే టాప్‌

5 Dec, 2019 04:15 IST|Sakshi

గ్రేడ్ల సాధనలో వారే ముందు 

తెలుగు మీడియం విద్యార్థుల వెనుకంజ

తెలుగు కంటే ఆంగ్ల భాషలో ఉత్తీర్ణతే అధికం

విద్యార్థుల్లో ప్రమాణాలపై ఎస్‌సీఈఆర్‌టీ తాజా విశ్లేషణ

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. పాఠశాలల విద్యార్థుల్లోని ప్రమాణాలను గమనిస్తే తెలుగు మాధ్యమ విద్యార్థుల కంటే ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అన్ని అంశాల్లో ముందంజలో ఉన్నారని తేలింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలను విశ్లేషించిన రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఈ అంశాలను నిగ్గుతేల్చింది. 

ఏ గ్రేడుల్లో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులదే అగ్రస్థానం
2018–19 విద్యా సంవత్సరంలో 6, 7, 8, 9 తరగతుల ఎస్‌ఏ–2 పరీక్షల ఫలితాలను ఎస్‌సీఈఆర్‌టీ పరిశీలించగా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే ముందంజలో ఉన్నారు. ఏ–1 నుంచి బీ2 వరకు గ్రేడ్ల సాధనలో వీరిదే పైచేయి. తెలుగు మాధ్యమ విద్యార్థులు వెనుకంజలో ఉన్నారు.

  

ప్రైవేటు స్కూళ్లు పరుగులు.. ప్రభుత్వ స్కూళ్లు నత్తనడక
తెలుగు మాధ్యమంలో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మంచి గ్రేడ్లు సాధించలేకపోతున్నారు. ఏ1తోపాటు ఆ తర్వాత గ్రేడ్లలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే అత్యధికం సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం నడుస్తున్న ప్రభుత్వ గురుకుల స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్‌ స్కూళ్ల ప్రమాణాలు బాగుండగా తెలుగు మాధ్యమం నడుస్తున్న ఇతర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే వెనుకబడి ఉంటున్నారు. 

సబ్జెక్టుల ఉత్తీర్ణతలోనూ ఆంగ్ల భాషలోనే అధికం
ఇక సబ్జెక్టుల వారీ ఉత్తీర్ణతను చూసినా ఆంగ్ల భాషదే పైచేయిగా ఉంది. తెలుగు విద్యార్థులు సంఖ్యలోనే కాకుండా ఉత్తీర్ణతలోనూ వెనుకంజలోనే ఉన్నారని ఎస్‌సీఈఆర్‌టీ విశ్లేషణలో తేలింది. లెక్కల్లో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణులవ్వగా భౌతిక శాస్త్రంలో వెనుకబడుతున్నారు. 

ఆంగ్ల మాధ్యమంతోనే మెరుగైన ఫలితాలు
– ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ
2008లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సక్సెస్‌ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఫలితాలను విశ్లేషిస్తే ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తూ ప్రైవేటు విద్యార్థులకు దీటుగా రాణిస్తున్నారు. గత ఐదేళ్ల ఫలితాలను విశ్లేషించినా ఆంగ్ల మాధ్యమ విద్యార్థులే అత్యధికంగా ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో మరింత మంచి ఫలితాలు వస్తాయి. అందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు ఆంగ్ల మాధ్యమ బోధనలో అత్యుత్తమ రీతిలో శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాలు, సింగపూర్, అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పాఠ్యపుస్తకాల సిలబస్‌లను పరిశీలించి ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నాం.

మరిన్ని వార్తలు