ఆగని వాన.. అపార నష్టం

16 Sep, 2014 23:54 IST|Sakshi
ఆగని వాన.. అపార నష్టం
కర్నూలు (అగ్రికల్చర్) : 
 జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి రోజూ సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాత్రి 8 గంటల వరకు వర్షం కురుస్తోంది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, మంత్రాలయం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పైర్లు నీటమునిగాయి. ఉల్లి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోడుమూరు,  సి.బెళగల్, గూడూరు, పెద్దకడుబూరు తదితర మండలాల్లో 15 రోజులుగా ఉల్లిని తవ్వుతున్నారు. వేలాది ఎకరాల్లో తవ్విన ఉల్లి వర్షపు నీటికి తడిసిపోయింది. ఆరబెట్టుకునేందుకూ వీలులేకుండా వాతావరణం చల్లబడింది. ఆదోనిలో మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోకి నీరు చేరింది. దీంతో పత్తి బేళ్లు తడిసిపోయాయి. రుద్రవరం మండలం డీ కొట్టాల వద్ద తెలుగుగంగ కాలువ బ్లాక్ చానల్‌కు గండిపడింది. దీంతో నీరు వృథాగా పోతోంది. మంగళవారం కోవెలకుంట్ల సమీపంలోని తాగు నీటిపథకం ఫిల్టర్ బావులను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ విజయమోహన్ బురదలోనే నడిచారు. వాహనాలు పోవడానికి వీలులేకపోవడంతో ఆయన కారుదిగి నడుచుకుంటూపోయి.. ఫిల్టర్ బావులను పరిశీలించారు. జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి నాలుగు రోజుల్లో సగటున 53.3 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి అత్యధికంగా ఉయ్యాలవాడలో 45.6 మి.మీ వర్షం కురిసింది. శిరువెళ్లలో 43.6, నందవరంలో 40.2, రుద్రవరంలో 38.0, కొత్తపల్లిలో 37.2 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్  నెల సాధారణ వర్షపాతం  125.7 మి.మీ కాగా, మొదటి పక్షంలో 76.4 మి.మీ(61 శాతం) వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
 
మరిన్ని వార్తలు