ప్రై'వేటే!'

15 Jul, 2020 09:39 IST|Sakshi

ఆ ల్యాబ్‌లో నెగెటివ్‌.. ప్రభుత్వ టెస్ట్‌ల్లో పాజిటివ్‌

వీడియో జర్నలిస్ట్‌ మరణానికి అదే కారణమా?

సాక్షి, తిరుపతి : నెలలు నిండిన గర్భిణి డెలివరీ కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. కరోనా టెస్ట్‌ చేయించుకొస్తేనే అడ్మిట్‌ చేసుకుంటామని వైద్యులు స్పష్టం చేశారు. ఆమె ఈ నెల 3న రుయాకు వెళ్లి స్వాబ్‌ ఇచ్చారు. అక్కడ ఆలస్యం అవుతుండడంతో 7న తిరుపతిలోని ప్రైవేటు ల్యాబ్‌కి వెళ్లి కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ ల్యాబ్‌ ఇచ్చిన రిపోర్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. మరుసటి రోజు రుయా నుంచివచ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్‌ అని తేలింది.

ఇటీవల మరణించిన వీడియో జర్నలిస్ట్‌ సారథి జ్వరం రావడంతో తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్‌ కరోనా టెస్ట్‌ చేసుకోమని సూచించారు. సారథి ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయించారు. అక్కడ నెగటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. కరోనా లేదని సాధారణ జ్వరమేనని చికిత్స చేసుకుని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. నాలుగు రోజుల తరువాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే.. అనుమానం వచ్చి స్విమ్స్‌కు వెళ్లారు. అప్పటికే చేయి దాటిపోయే పరిస్థితి. స్విమ్స్‌లో చేరిన మరుసటి రోజే మృతిచెందారు. 

కరోనా నిర్ధారణ పరీక్షలను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా  ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) అనుమతి పొందిన తిరుపతిలోని ఆ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో జిల్లా ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ల్యాబ్‌లపై ఒత్తిడి పెరిగింది. అక్కడ ఫలితాల నివేదిక ఆలస్యం అవుతోందనే కారణంతో చాలామంది ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు ల్యాబ్‌ కరోనా నిర్ధారణ ఫలితాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో స్వాబ్‌ ఇచ్చి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పలువురు తిరిగి ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో వచ్చే ఈ రెండు ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కొందరికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా.. ప్రైవేట్‌ ల్యాబ్‌లో నెగటివ్‌గా రిపోర్ట్‌ రావడంతో ధైర్యంగా విచ్చలవిడిగా తిరిగి ఇతరులకు వ్యాపింపచేయడమే కాకుండా వారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఆ ప్రైవేటు ల్యాబ్‌పై ఫిర్యాదులు అధికమయ్యాయి. రోజుల వ్యవధిలోనే రెండు రకాలుగా రిపోర్టులు వస్తుండడంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కరోనా ఉందా? లేదా? అన్న అనుమానంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 

విచారించి చర్యలు తీసుకుంటాం
తిరుపతిలోని ఆ ల్యాబ్‌పై పలు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ల్యాబ్‌లో పొరబాట్లు జరుగుతున్నట్లు తేలితే అనుమతులు రద్దుచేస్తాం.
– డాక్టర్‌ పెంచలయ్య,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

మరిన్ని వార్తలు