పోలీసుల సంక్షేమానికి భరోసా   

4 Nov, 2019 04:58 IST|Sakshi

‘భద్రతా స్కీమ్‌’తో పెళ్లి, ఇల్లు, పిల్లల చదువుకు రుణ సాయం

ఏడాది కాలంలో రూ.200 కోట్లు ఆర్థిక తోడ్పాటు

279 మంది పోలీస్‌ పిల్లల పెళ్లికి రూ.12.97 కోట్లు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు సిబ్బంది సంక్షేమానికి ‘భద్రతా స్కీమ్‌’తో భరోసా లభిస్తోంది. నెలవారి జీతం నుంచి వారు చెల్లించే కొద్ది మొత్తాలు పలువురి ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. సొసైటీ చట్టం ప్రకారం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ పోలీస్‌ ఉద్యోగి పొదుపు పరస్పర సహకార సొసైటీ (భద్రతా స్కీమ్‌) ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు ఇస్తోంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి భారీ ఖర్చులతోపాటు పోలీసుల వ్యక్తిగత రుణాలకు కూడా భద్రతా స్కీమ్‌ అక్కరకు వస్తోంది. ఏపీ డీజీపీ ప్రధాన కార్యాలయంలో పోలీస్‌ సంక్షేమ (వెల్ఫేర్‌) విభాగం భద్రతా స్కీమ్‌ను పర్యవేక్షిస్తోంది. దీని ద్వారా గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు సుమారు రూ.200.43 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు.  

కష్టాల్లో అండగా....
పెద్ద కష్టం వచ్చిపడితే అప్పటికప్పుడు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భద్రతా స్కీమ్‌లో దరఖాస్తు చేసుకుంటే అవసరానికి తగినట్టుగా ఆర్థిక సాయాన్ని రుణంగా అందిస్తున్నారు. దాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు ఉంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు పదవీ విరమణ చేసిన 1,168 మందికి రూ.13.37కోట్లు తిరిగి చెల్లించారు. రుణాలు తీసుకున్న 81 మంది సభ్యులు మృతి చెందడంతో రూ.1.32 కోట్లు రాయితీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న 237 కుటుంబాలకు రూ.11.41 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.
 
కష్టాల్లో ఉన్న పోలీసులకు ఎంతో ఉపయోగం... 
పోలీసులకు కష్టాల్లో ‘భద్రత’ బాగా ఉపయోగపడుతోంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, ఇల్లు నిర్మాణం, ఇతర అత్యవసర సమయాల్లో విషయాల్లో వచ్చే ఖర్చుల విషయాల్లో భద్రతా స్కీమ్‌ బాగా ఉపయోగపడుతోంది. ఈ స్కీమ్‌పై పోలీసుల్లోనూ  అవగాహన పెరగడంతో ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అవసరాన్ని బట్టి రూ.లక్షల్లో రుణాలిచ్చి నెలవారీగా జీతంలో మినహాయించుకునే వెసులుబాటు బాగుంది. దీన్ని ప్రతీ పోలీస్‌ ఉపయోగించుకునే అవకాశం రావాలి.  
–గుర్రం జయపాల్, కృష్ణా జిల్లా పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

>
మరిన్ని వార్తలు