ఆపరేషన్లకు బ్రేక్‌!

23 Nov, 2018 13:04 IST|Sakshi
ఈఎన్‌టీ ఆపరేషన్‌ గదిలో జరుగుతున్న నిర్మాణ పనులు

ఎన్‌ఏబీహెచ్‌ నిధులతో ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణం  

నిర్మాణ పనుల జాప్యంతో రెండు నెలలుగా నిలిచిన ఆపరేషన్లు

జీజీహెచ్‌లో అవస్థలు పడుతున్న రోగులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రెండు నెలలుగా ఈఎన్‌టీ వైద్య విభాగంలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఆపరేషన్‌ థియేటర్‌ను ఆధునీకరించేందుకు ఆపరేషన్లు నిలిపివేశారు. నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తూ ఉండటంతో ఆపరేషన్ల ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఆరుగురికి..
ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రతిరోజూ ఆరుగురికి పైగానే ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతినెలా 80కి పైగా ఆపరేషన్లు చేస్తూ ఉండటంతో డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా ఆస్పత్రికి నెలకు రూ.12లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. రెండు నెలలుగా ఆపరేషన్లు నిలిచిపోవడంతో ఆస్పత్రికి పథకం ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంతో పాటుగా వైద్యులు, వైద్య సిబ్బందికి వచ్చే పారితోషికాలు సైతం తగ్గిపోయాయి. అత్యవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చే ఈఎన్‌టీ బాధితులకు మాత్రమే వారం ఒక్కరికి లేదా ఇద్దరికి ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లో ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ రోగులకు తెల్లరేషన్‌కార్డు ఉన్నా ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా అన్ని రకాల ఆపరేష్లన్లు చేయకపోవటంతో జీజీహెచ్‌ చుట్టూ రోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆస్పత్రి అధికారులు సైతం హెచ్‌డీఎస్‌ మీటింగ్‌లో చర్చించి అత్యాధునిక వైద్య పరికరాల ను ఈఎన్‌టీ వైద్య విభాగానికి కేటాయించారు. అయితే ఆధునిక వైద్య సేవలను పేద రోగులకు చేరువ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.

ఆర్ధోపెడిక్‌ది అదే పరిస్థితి..
ఆర్ధోపెడిక్‌ వైద్య విభాగం ఆపరేషన్‌ థియేటర్‌ సైతం నిర్మాణం జరుగుతుంది. రెండు నెలలుగా ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణం జరుగుతూ ఉండటంతో అత్యవసర కేసులకు, రోడ్డు ప్రమాద బాధితులకు మాత్రమే ఆర్ధోపెడిక్‌ వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నారు. సాధారణ సమస్యలతో వచ్చే వారు, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఆపరేషన్‌ థియేటర్స్‌ కొరత వల్ల ఆపరేషన్లు చేయడంలేదు. ప్రభుత్వం 2015 లో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందటం తో ఆస్పత్రి అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయిం చింది. నిధులను సకాలంలో వినియోగించలేదనే ఆరోపణలు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికా రులపై వచ్చాయి. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీజీహెచ్‌కు విడుదల చేసిన నిధులు వినియోగంలో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసి మెమో కూడా జారీచేశారు. ఆస్పత్రి అధికారులు సకాలంలో ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.

వారంలో పనులు పూర్తి చేస్తాం
ఎన్‌ఏబీహెచ్‌ నిధులతో జీజీహెచ్‌లో ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నాం. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.4 కోట్లతో నాలుగు మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ కల్లా అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్స్‌ అందుబాటులోకి వస్తాయి.
–యడ్లపాటి అశోక్‌కుమార్,ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ, గుంటూరు

మరిన్ని వార్తలు