సొంతూరి కోసం రాజకీయాల్లోకి..

11 Jan, 2014 00:08 IST|Sakshi

 మెదక్ రూరల్, న్యూస్‌లైన్:  ఉన్నత విద్యావంతులైన ఓ ఇద్దరు యువకులు తమ కెరీర్‌ను వదులుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉద్యోగాలు చేస్తే తాము, తమ కుటుంబమే బాగుపడుతుందని.. అదే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధి అయితే గ్రామాన్నే బాగుపరచవచ్చంటున్నారు మెదక్ మండలానికి చెందిన ఈ యువకులు.  ఇలా వారు వచ్చిరాగానే ఉపసర్పంచ్‌లుగా పదవులను అందిపుచ్చుకున్నారు.

 మెదక్ మండలం మారుమూల గ్రామమైన కొత్తపల్లికి చెందిన చిరంజీవిరెడ్డి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోగల ఎక్నోలైట్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.20 వేల వేతనం. అందులో ఎనిమిది నెలలు పనిచేశారు. అంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో పుట్టిపెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్‌గా పోటీచేసేందుకు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అంతలోనే ఉప సర్పంచ్ పదవి కూడా ఇతణ్ణి వరించింది.

 వాడి ఉపసర్పంచ్‌గా..
 మండలంలోని వాడి గ్రామానికి చెందిన యామిరెడ్డి బీఏ, బీపీఈడీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం వెతుకోవాల్సింది పోయి రాజకీయాల్లోకి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి చేరుకున్నారు. యామిరెడ్డికి సైతం రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో గ్రామంలోని 5వ వార్డుసభ్యుడిగా పోటీ చేసి నెగ్గారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు పరిష్కరిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు