‘దీక్ష’తో పనులు

15 Dec, 2018 13:21 IST|Sakshi
పనులకు శ్రీకారం చుడుతున్న చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, ఈవో కోటేశ్వరమ్మ

29 నుంచి భవానీ దీక్షల విరమణ

భారీ ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం

8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

రూ.1.24 కోట్లతో క్యూలైన్లు, టెంట్లు ఏర్పాటు

గురు భవానీలతో గిరి ప్రదక్షిణలు

5 రోజులపాటు కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులు బంద్‌

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరిగే అతి పెద్ద ఉత్సవాల్లో భవానీదీక్షల విరమణ రెండవది. భవానీమాల ధరించి 40 రోజులు పాటు నిష్టతో ఆచరించే భక్తులు.. అనంతరం అమ్మవారి సన్నిధికి వచ్చి ఆ దీక్షను విరమిస్తారు. ఏటా ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సారి సుమారు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనావేస్తున్నారు.

పక్కా ఏర్పాట్లు..
ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే భవానీదీక్షల విరమణకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులుకలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇంజినీరింగ్‌ పనులతో పాటు లడ్డూ ప్రసాదాలు తయారీ, భక్తులకు కేశఖండన, నదిలో పుణ్యస్నానాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.1.24 కోట్లతో పనులు
సుమారు రూ.1.24 కోట్లతో ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నారు. ముఖ్యంగా వినాయకుడు గుడి వద్ద నుంచి కొండపైకి అక్కడ నుంచి మెట్ల మార్గంలో కిందకు వచ్చే విధంగా రూ.20 లక్షలతో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సమాచారం తెలియజేసేందుకు మైక్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.6 లక్షల వ్యయంతో 33 సీసీ టీవీల కోసం అద్దె పద్ధతిలో తీసుకున్నారు. రూ.11 లక్షలతో పద్మావతి ఘాట్, కేశఖండనశాలలో మొబైల్‌ టాయిలెట్స్‌ను ఉత్సవాల కోసం సమకూర్చుతున్నారు.

గురు భవానీలతో గిరిప్రదక్షిణ..
ఇటీవల దేవస్థానం పరిధిలోని గురు భవానీలతో ఈవో కోటేశ్వరమ్మ సమావేశం నిర్వహించారు. 29వ తేదీ నుంచి భవానీదీక్షలు ప్రారంభం అవుతున్నందున 28వ తేదీన గురు భవానీలతో ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. 29వ తేదీ నాటికి ఇతర జిల్లాల నుంచి వచ్చే గురు భవానీలతో పాటు స్థానికంగా ఉండే గురు భవానీలంతా కలిసి సుమారు 500 మందితో ఈ ప్రదక్షిణ చేయాలని నిర్ణయించారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఫ్లైఓవర్‌ పనులకు బ్రేక్‌..
భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పనులు ఆపాలని దేవస్థానం అధికారులు కోరారు. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫ్లైఓవర్‌ పనులు ఆపడం కష్టమని ఆర్‌అండ్‌బీ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శుక్రవారం దేవస్థానం, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టర్‌ ప్రతినిధులు దుర్గగుడిలో సమావేశమయ్యారు. చివరకు ప్రస్తుతం పనులు ఆపాల్సిన అవసరం లేదని ఈనెల 29 నుంచి 2వ తేదీ వరకు దుర్గగుడి క్యూలైన్లు ఉన్న చోట మాత్రం పనులు చేయకూడదని నిర్ణయించారు.

పనులకు శ్రీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో డిసెంబర్‌ 29వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీక్ష విరమణకు  తరలివచ్చే లక్షలాది మంది భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్ల ఏర్పాటు పనులను శుక్రవారం ఆలయ ఈవో వీ. కోటేశ్వరమ్మ, చైర్మన్‌ గౌరంగబాబు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కెనాల్‌ రోడ్డు వినాయకుడి వద్ద నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్‌ పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌ శర్మ, ఈఈ భాస్కర్, ఆలయ అధికారులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు