దుర్గమ్మ చీరలపై కమిటీ వేసిన ఈఓ

19 Oct, 2019 20:55 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శనివారం చీరలపై రేట్ల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈఓ సురేష్ బాబు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చీర అసలు ధర అంచనా వేసి.. రేటు మార్చి మళ్లీ అమ్మకానికి పెట్టనున్నారు. దీంతో భక్తులు సమర్పించేటప్పుడు చీర ధర ఎంత చెబితే అంత రేటుకే అమ్మకానికి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది నుంచి సుమారు 2 వేలకు పైగా చీరలు మూలనపడి ఉన్నాయి. రూ.1000 చీరను రూ.5000కు ధర నిర్ణయించడంతో కొనుగోలు చేయడానికి భక్తులు వెనుకాడుతున్నారు. దుర్గమ్మ చీరల కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపకపోవడంతో.. గుట్టలుగా పేరుకుపోయాయి. చీరల కౌంటర్లని, భద్రపరిచిన స్టోర్ రూమ్‌ను పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్ పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దసరా సమయంలో కూడా చీరలు అమ్ముడుపోలేదు. భక్తులు సమర్పించే చీరలను.. అమ్మవారి ప్రసాదంగా తిరిగి భక్తులకే దుర్గగుడి అధికారులు అమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు