లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు

30 Jun, 2018 06:12 IST|Sakshi
జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చిన వైద్యపరికరాలను తిరిగి ఏలూరుకు తరలించేందుకు లారీలో లోడ్‌ చేస్తున్న దృశ్యం

కేంద్ర బృందాన్ని మాయచేసిన వైద్యాధికారులు

లేని పరికరాలు, వసతులు ఉన్నట్లుగా చూపిన వైనం

హడావుడిగా ఏలూరు నుంచి తీసుకువచ్చిన పరికరాలు

బృందం వెళ్లిపోగానే ఏలూరుకు పరికరాల తరలింపు

జంగారెడ్డిగూడెం : ఒక్కసారిగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యపరికరాలు వచ్చేశాయి. ఆయా విభాగాల్లో వైద్యపరికరాలు ఏర్పాటు చేసేశారు. ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా కనిపించేలా ముస్తాబు చేశారు. దీంతో ప్రజలు, రోగులు ఆహా ఏరియా ఆసుపత్రికి అన్ని సదుపాయాలు, వైద్యపరికరాలు వచ్చేశాయి అనుకున్నారు. మూడు రోజుల పాటు వైద్యసేవలు కూడా వైద్యులు అలాగే అందించారు. వైద్యులు సిబ్బంది ఠంచన్‌గా విధులకు హాజరయ్యారు. రోగులంతా ఓహో అనుకున్నారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం మాట. అయితే శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు షాక్‌ ఎదురైంది. సినిమా సెట్టింగ్‌లు మాదిరిగా ప్యాకప్‌ చెప్పినట్లు ఏరియా ఆసుపత్రికి వచ్చిన వైద్య పరికరాలు ప్యాక్‌ చేసి తరలిస్తున్నారు. ఏం జరుగుతుందో రోగులకు అర్థం కాలేదు. ఇంతకీ వైద్యపరికరాలన్నీ ఏలూరు ఆసుపత్రివట. మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి వాటిని శుక్రవారం ప్యాక్‌ చేసి తిరిగి ఏలూరు ఆసుపత్రికి తరలించేశారు.

దీనికి కారణం ఏమిటంటే ఏరియా ఆసుపత్రి పనితీరుపై గ్రేడింగ్‌ ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యబృందం వచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో కేంద్ర బృందంలోని వైద్యులు డాక్టర్‌ మినీ మోలా, డాక్టర్‌ బీఎన్‌ వ్యాస్, డాక్టర్‌ అర్చన వర్మలు ఇక్కడే మకాం చేసి ఏరియా ఆసుపత్రి ప్రతి అంగుళం పరిశీలించి, వైద్యులు, వైద్యపరికరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పనితీరు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బృందం వస్తున్న సందర్భంగానే ఏరియా ఆసుపత్రిలో లేని వైద్యపరికరాలన్నీ తీసుకువచ్చి హడావుడిగా ఆయా విభాగాల్లో అమర్చారు. హృద్రోగ విభాగం, స్కానింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి ఇక్కడ అన్నీ ఉన్నట్లు సినీమాయ చేశారు. గురువారం సాయంత్రం కేంద్ర బృందం వెళ్లిపోయింది.

దీంతో శుక్రవారం ఉదయం ప్యాకప్‌ చెప్పేశారు. ఏలూరు నుంచి వచ్చిన పరికరాలను ప్యాక్‌ చేసి లారీలో ఏలూరుకు తరలించేశారు. చివరకు కేంద్ర బృందాన్ని కూడా మన వైద్యాధికారులు, వైద్యులు తమ నైపుణ్యంతో లేనిది ఉన్నట్టుగా చూపి మహా మాయ చేశారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈ తతంగం చూసి మరో శంకర్‌దాదా సినిమాలో హీరో తన తండ్రి వస్తున్నాడని తెలియగానే ఇంటిని ఆసుపత్రిగా మార్చి చేసిన మాయను, మరోసారి ఇక్కడ చూస్తున్నట్లుగా ఫీలయ్యారు.

మరిన్ని వార్తలు