సమన్యాయం కావాలి: విజయమ్మ

6 Aug, 2013 09:13 IST|Sakshi
సమన్యాయం కావాలి: విజయమ్మ

ఇడుపులపాయ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. హైదరాబాద్ను తెలంగాణలో కలపటం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని ఆమె మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు.

సమన్యాయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విభజనపై కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయని విజయమ్మ విమర్శించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.


జగన్‌ కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని విజయమ్మ అన్నారు. విభజనపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని విజయమ్మ అన్నారు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే సంతోషంగా విడిపోవాలనుకున్నారని ఆమె పేర్కొన్నారు. విభజన చేసినా.... చేయకపోయినా అన్ని ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ఉన్నారన్నారు. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విజయమ్మ తెలిపారు.
 

మరిన్ని వార్తలు