ఎర్రమల్లెలు వాడిపోయాయి....

6 Oct, 2019 09:15 IST|Sakshi

నరసాపురం: ఎర్రమల్లెలు వాడిపోయాయి.. గలగలా వాక్‌ప్రవాహం ఆగిపోయింది.. ‘అదికాదు అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా మాట్లాడే కంఠం మూగబోయింది.. సినీరచయిత, సీపీఐ సీనియర్‌ నేత మంచిగంటి రామారావు(87) శనివారం సాయంత్రం నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఒక కుమారుడు నారాయణరావు జర్నలిస్ట్‌గా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఎంజీఆర్‌గా సుపరిచితుడైన రామారావు ప్రజానాట్యమండలిలో చురుగ్గా పనిచేస్తూ సినీరంగంవైపు మళ్లారు. పలు విప్లవ సినిమాలకు కథలు, మాటలు అందించారు. ప్రజానాట్య మండలి ఏర్పడిన తొలినాళ్లలోనే అందులో చేరి విశేష సేవలు అందించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి తరఫున పలు ప్రదర్శనలు ఇచ్చారు. తన 21వ ఏట నుంచే సీపీఐలో చేరి పలు ప్రజాసమస్యలపై పనిచేశారు. 

ఆయన తొలితరం కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకర్తల్లో ఒకరు. 1950 నుంచి సీపీఐలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. రాష్ట్ర ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మాదాల రంగారావుకు పేరు తెచ్చిన ఎర్రమల్లెలు, యువతరం కదిలింది చిత్రాలకు కథా సహకారం అందించడమే కాకుండా మాటలు అందించారు. ధవళ సత్యం దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు మాటలు అందించారు. ఆయన మృతిపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సీపీఐ రాష్ట్ర కమటి సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ సంతాపం తెలిపారు. ఆదివారం రామారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  

ఎర్ర సినిమా చిరునామా.. ఎంజీఆర్‌
నర్సాపురం కాలువ.. పొడవునా దుమ్ము రేగే కంకర రోడ్డు... సైకిల్‌ హ్యాండల్‌కి ఒక పక్క తెల్లని సత్తు క్యారియర్‌.. మరో పక్క ఎర్రని జెండా... ఇదీ దశాబ్దాల క్రితం దృశ్యం. ఆ కష్టజీవికి అటుపక్క, ఇటుపక్క నిలబడి కాపుకాచిన కలం వీరుడు ఎంజీ రామారావు! వృత్తి రెవెన్యూ విభాగం.. ప్రవృత్తి సాంస్కృతిక రంగం. అందరూ బాబాయ్‌ అని పిలిచే ఆత్మీయుడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా నిలిచిన కమ్యూనిష్టాగరిస్టుడు. నాకు తెలిసి వెండి తెరపై ఎర్ర జెండా ఎగురవేసిన వారిలో ఒకడు. మా భూమి నాటకంలా ఈయన రాసిన ఎర్రమట్టి నాటకం  తెలుగునాట ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ప్రదర్శించారు. కథ, నాటకం– కళ ఏదైనా ఆర్ట్‌ఫామ్‌ ఉండాలనేది ఎంజీఆర్‌ ఎప్పుడూ చెప్పేమాట. 

ఆయన రాసిన ఇరుసు, సత్యంవధ, జ్వాలాశిఖలు, యుగసంధి  నాటకాలు పరిషత్‌ వేదికలపై బహుమతులు అందుకున్నాయి. చేతిలో డైరీ.. గలగలా వాక్‌ప్రవాహం.. ‘అదికాదు అబ్బాయి’ అని చెప్పే మాటలు వినడానికి తాడేపల్లిగూడెం వస్తే చాలు ఆయన చుట్టూ గుమిగూడేవారం. కుర్రకారు ఆయన ఫ్యాన్స్‌. కబుర్ల మధ్య కాలం కరిగిపోయేది. మా నాటకాల బ్యాచ్‌ ఇంతే అబ్బాయి అని ముక్తాయించి నర్సాపురం మొదటి బస్సుకు బయల్దేరేవారు. ఇప్పుడు.. మరెప్పటికీ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు.  –ఎస్‌.గుర్నాథ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా