సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్: ఎర్రబెల్లి

18 Jan, 2014 03:33 IST|Sakshi
సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్: ఎర్రబెల్లి

అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శుక్రవారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతున్న సమయంలో  కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనకు సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అనడం కలకలం సృష్టించింది. మరోపక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మంత్రి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ సభ్యులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు దమ్ముంటే రాజీనామా చేసి ఉండాల్సిందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు.
 
 కాగా, పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎర్రబెల్లికి హితవు పలికారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి కోరగా, స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఆయన స్పీకర్ పోడియం ముందుకు వెళ్లారు. అయితే, ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆయనకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని.. సభ్యులు రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం సరికాదని శైలజానాథ్‌ను ఉద్దేశించి అన్నారు. గొడవ సద్దుమణిగిన అనంతరం శైలజానాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

>
మరిన్ని వార్తలు