జడ్జినే కొనేసి..హైదరాబాద్‌కు పరార్!

11 May, 2014 00:28 IST|Sakshi

2004లో ప్రేయసిని చంపేసిన హైదరాబాదీ
 పెరోల్ కోసం అమెరికా జడ్జికి రూ.20 లక్షల ముడుపులు
 
 సాక్షి, హైదరాబాద్: హత్య కేసులో జైలు శిక్ష పడిన ఓ హైదరాబాదీ.. ఏకంగా అక్కడి న్యాయమూర్తికే లంచమిచ్చి పెరోల్‌పై బయటకొచ్చేశాడు. వచ్చీ రాగానే అమెరికా నుంచి పారిపోయి హైదరాబాద్‌లో తేలాడు. అమెరికాలో సంచలనం రేపిన ఈ కేసులో అతడు అక్కడి పోలీసుల నుంచి తప్పించుకున్నా.. మన సీఐడీ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.
 
 ప్రేమించి.. హత్య చేసి..: సీఐడీ అదనపు డీజీ టి. కృష్ణప్రసాద్ కథనం మేరకు.. చిక్కడపల్లికి చెందిన ఓ డాక్టర్ కుటుంబం 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడింది. ఆ డాక్టర్ కుమారుడైన ముద్దమల్లె అమిత్ లివింగ్‌స్టన్ అలి యాస్ సంజీవకుమార్(45) మెడికల్ ట్రాన్స్‌క్రిప్షనిస్టుగా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి ఆ దేశ పౌరసత్వం కూడా లభించింది. అక్కడే టీచరుగా పనిచేస్తున్న హెర్మీలియా హెర్నాండేజ్ అనే యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో 2004 ఏప్రిల్‌లో పథకం ప్రకారం కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న లివింగ్‌స్టన్‌పై కేమరూన్ కౌంటీ కోర్టులో కేసు విచారణ నడిచింది.
 
 జడ్జికే ముడుపులు ఎరవేసి..: తనకు శిక్ష తప్పదని తెలుసుకున్న లివింగ్‌స్టన్  పారిపోవడానికి పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తి ద్వారా స్థానిక జడ్జితో పాటు అటార్నీకి రూ.20 లక్షల మేర ముడుపులు చెల్లించి, 60 రోజుల పెరోల్ పొందాడు. పెరోల్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత రెండో రోజే ఆ కోర్టు అతడికి 23 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్త్తూ తీర్పును వెలువరించింది. కానీ అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, జడ్జితో పాటు అటార్నీకి కూడా లంచం ఇవ్వడంతోనే లివింగ్‌స్టన్ పెరోల్ పొందినట్లు అక్కడి దర్యాప్తు అధికారులకు పలు ఆధారాలు లభించాయి. ఈ విషయంపై అక్కడి మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీం తో అక్కడి ప్రభుత్వం పెరోల్ ముడుపుల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై  విచారణ జరిపిన దర్యాప్తు అధికారులు.. కుమ్మక్కు నిజమేనని తేల్చారు. దీంతో అటార్నీకి, జడ్జికి 16 ఏళ్లపాటు అక్కడి కోర్టు జైలు శిక్షను విధించింది. పరారైన లివింగ్‌స్టన్‌ను ప్రభుత్వం అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో 15వ స్థానంలో పెట్టింది. ఇతడిని పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సహాయంతో రెడ్‌కార్నర్ నోటీసును 2008లో జారీ చేసింది.
 
 ఇలా పట్టుబడ్డాడు..
 
 అక్కడి నుంచి 2007లో పారిపోయి హైదరాబాద్‌కు వచ్చిన లివింగ్‌స్టన్ కాప్రా మాధవపురికాలనీలోని ఎస్‌ఎస్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో మకాం వేశాడు. మరోపక్క రెడ్‌కార్నర్ నోటీసు అందుకున్న సీఐడీ అధికారులు గత సంవత్సరకాలంగా లివింగ్‌స్టన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లివింగ్‌స్టన్ కదలికలపై స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ పై సీఐడీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు తెలిపామని, రెండుమూడు రోజుల్లో వారు తమ వద్దకు రానున్నారని, వారు వచ్చిన వెంటనే లివింగ్‌స్టన్‌ను అప్పగిస్తామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. కాగా అమెరికాలో పెరోల్ పొందిన లివింగ్‌స్టన్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు ఎలా చేరుకున్నాడనేది మిస్టరీగా మారిందని, ఈ విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. కాగా ఐపీసీ సెక్షన్ 419, 420తోపాటు విదేశీ వ్యవహారాల నిబంధనల ఉల్లంఘన చట్టంలో పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ పై అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.


 

>
మరిన్ని వార్తలు