టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌

13 Jun, 2020 03:17 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసి కారులోకి ఎక్కిస్తున్న అధికారులు

ఈఎస్‌ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్న ఏసీబీ

అరెస్ట్‌ సమాచారాన్ని కుటుంబీకులకు తెలిపిన అధికారులు

పటిష్ట బందోబస్తు మధ్య విజయవాడకు తరలింపు 

రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు

మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

ఈఎస్‌ఐ స్కామ్‌లో 19 మంది ప్రమేయం

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/రాజమహేంద్రవరం క్రైమ్‌/సాక్షి, తిరుపతి: కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు జమానాలో ఈఎస్‌ఐలో జరిగిన రూ.151 కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో అచ్చెన్నాయుడితోపాటు మరో ఆరుగురిని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని అచ్చెన్నాయుడి ఇంటికి వెళ్లి..  ఉదయం 6.50 గంటలకు ఏసీబీ అధికారులు ఆయనకు అరెస్ట్‌ సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటలకు అవినీతి నిరోధక శాఖ సీఐయూ యూనిట్‌ (విజయవాడ) డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని అచ్చన్నాయుడు భార్య, ఆయన లాయర్, ఆయన సోదరుడు హరిప్రసాద్‌ కుమారుడు సురేష్‌కుమార్‌కు తెలియజేశారు. ఆ మేరకు సమాచారం తనకు అందినట్టుగా కింజరాపు సురేష్‌కుమార్‌ సంతకం చేశారు. అనంతరం అచ్చెన్నాయుడిని నిమ్మాడ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. 


విజయవాడలో ఏసీబీ ఆఫీసు వద్ద అచ్చెన్నాయుడు 

అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే..
క్రైమ్‌ నంబర్‌ 04/ఆర్‌సీఓ – సీఐయూ – ఏసీబీ/2020 యు/ఎస్‌ 13(1), (సీ), (డీ), ఆర్‌/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం – 2018
సెక్షన్‌ 408, సెక్షన్‌ 420, 120 – బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసులు నమోదు చేశారు. వాటిలో కొన్ని ఆర్థిక మోసాలకు సంబంధించినవి. 

పటిష్ట బందోబస్తు 
కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలోని నివాసమున్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
 
ఉదయం 6.50 గంటలకు అచ్చెన్నాయుడు ఉన్న ఇల్లు మూడో అంతస్తుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈఎస్‌ఐ మందుల కుంభకోణంలో మీ ప్రమేయం ఉందని, దాని కారణంగా అరెస్టు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ‘అప్పుడే విచారణ పూర్తయిపోయిందా?’ అని ఏసీబీ అధికారులను ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ పూర్తయిందని, అక్రమాల్లో మీ పాత్ర ఉందని తేలడంతో అరెస్టు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలియజేశారు.

దీంతో ఎటువంటి ప్రతిఘటన లేకుండా 7.20 గంటల సమయంలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రమే అక్కడికి చేరుకున్నారు. 


అరెస్టయిన వారు.. సీకే రమేశ్‌కుమార్‌,విజయ్‌కుమార్‌, జనార్దన్

డాక్టర్‌ ఈటగాడి విజయకుమార్‌ అరెస్ట్‌
ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఇన్‌చార్జ్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఈటగాడి విజయకుమార్‌ను రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేసింది. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, పరికరాల కొనుగోలు కుంభకోణంలో ఆయన పాత్ర ఉందంటూ విజిలెన్స్‌ నివేదికల ఆధారంగా ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా విధుల్లో చేరిన ఆయన సూపరింటెండెంట్‌గా, ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. స్పెషల్‌ గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌గా రిటైరయ్యారు. ఎక్కువ కాలం రాజమహేంద్రవరంలోనే వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన్ను ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు.
 
తిరుపతిలో రమేష్‌కుమార్, వి.జనార్ధన్‌ అరెస్ట్‌
ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ చింతల కృష్ణప్ప రమేష్‌ కుమార్, తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జనార్ధన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు వారి నివాసాల వద్ద అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. రమేష్‌కుమార్‌ 2014–16లో తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 

అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో వీరు వైద్య పరికరాలు, మందులు, ఫర్నిచర్‌ కొనుగోలు చేసినట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. ఈఎస్‌ఐ ఆస్పత్రికి మంజూరైన నిధుల కోసం బినామీ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు ఈఎస్‌ఐ కమిటీ రిజెక్ట్‌ చేసిన మందులను కూడా కొనుగోలు చేశారు. 

తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, రేణిగుంట, బంగారుపాలెం, కుప్పంలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రికి అవసరమైన మందులు, పరికరాలు, ఫర్నిచర్‌ అవసరానికి మించి కొనుగోలు చేయటంతో పాటు వాటికి అధిక ధరలు చెల్లించినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో వెలుగు చూసినట్లు ఏసీబీ డీఎస్పీ మల్లీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. 

ఈ స్కామ్‌లో పాత్రధారులైన తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి ఈఎస్‌ఐ డిస్పెన్సరీ నిర్వాహకుడు గోనె వెంకటసుబ్బారావు, విజయవాడ డీఐఎంఎస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇవన రమేష్‌బాబు, సూపరింటెండెంట్‌ ఎంకేపీ చక్రవర్తి (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు)లను కూడా ఏసీబీ అరెస్ట్‌ చేసింది.  

ఏసీబీ కోర్టులో హాజరు
అచ్చెన్నాయుడును శుక్రవారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ అధికారులు సమర్పించిన రికార్డులను కోర్టు అధికారులు పరిశీలించారు. అనంతరం విచారణ నిమిత్తం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించారు.


ఏసీబీ కోర్డు వద్ద లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు 

కోర్టు వద్ద లోకేష్‌ హల్‌చల్‌
ఏసీబీ కోర్టుకు అచ్చెన్నాయుడిని హాజరుపర్చడంతో శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు సమీపంలో లోకేష్‌ హల్‌చల్‌ చేశారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని, ఆయన్ను పరామర్శించనివ్వరా? అంటూ పోలీసులపై మండిపడ్డారు.

పోలీసులు వస్తున్నట్లు సమాచారం లేదు
టెక్కలి: పోలీసులు ఇంట్లోకి వచ్చిన విషయం తమకు తెలియదని, హఠాత్తుగా మేడ పైకి వచ్చి తన భర్తను తీసుకెళ్లిపోయారని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు భార్య విజయమాధవి అన్నారు. 

మరిన్ని వార్తలు