మా ప్రభుత్వం వచ్చింది.. మా పల్లెకు పాలన తెచ్చింది

11 Feb, 2020 13:15 IST|Sakshi
నిర్వాహకులకు బహుమతి ప్రదానం చేస్తున్న సాక్షి ప్రతినిధులు తదితరులు

సాక్షి మీడియా ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

‘గ్రామ సచివాలయాలు ప్రయోజనాలు’ అంశంపై విద్యార్థుల మనోభిప్రాయాలు  

గ్రామ స్వరాజ్యం, గ్రామ సుపరిపాలన అనే మాటలు వినడమే కానీ చూడలేదు

ఇప్పుడు చూస్తున్నామంటూ మాటల్లో సంతోషం

కావలి: గ్రామ/వార్డు సచివాలయాల పరిపాలనతో గ్రామ స్వరాజ్యం వచ్చిందని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కావలి మండలం అన్నగారిపాళెం పంచాయతీ ఒట్టూరులోని ఏపీ ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో ‘గ్రామ సచివాలయాలు ప్రయోజనాలు’ అనే అంశంపై  వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతి వరకు 125 మంది విద్యార్థిని విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ‘మా ప్రభుత్వం వచ్చింది.. మా పల్లెకు పాలన తెచ్చింది’ అని విలక్షణన శైలిలో తమ మనోభావాలను వెల్లడించారు. ఆర్థిక, రాజకీయ అండ ఉన్న వారు మాత్రమే ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి దర్జాగా కూర్చొని పనులు చేయుంచుకునే వారని, సాధారణ ప్రజలు మాత్రం కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి లేదని, అసలు అధికారులు లోపలికే రానిచ్చే వారు కాదని విద్యార్థులు పేర్కొన్నారు. ఒకవేళ సాధారణ ప్రజలు ఏదోక విధంగా కార్యాలయంలోకి వెళ్లినా నిలబడే తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవాల్సి వచ్చేదని విద్యార్థులు పేర్కొన్నారు. ఇలాంటి దుర్గతిలో ఉన్న సాధారణ ప్రజల బాధలను తీరుస్తూ, ఆత్మాభిమానంతో తమ గ్రామంలోనే ఉన్న గ్రామ సచివాలయంలో దర్జాగా కూర్చొని సమస్య చెప్పి, ఎప్పటిలోగా వాటిని పరిష్కరిస్తారో కూడా తెలుసుకునే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని విద్యార్థులు తమ వ్యాసాల్లో రాశారు.  

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం.. గ్రామ పరిపాలన.. అనే మాటలను తరతరాలుగా వినడమే కాని, ప్రజలు ప్రత్యక్షంగా చూసింది, అనుభవించింది లేదని విద్యార్థులు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం గ్రామంలోనే ప్రభుత్వ పరిపాలన, గ్రామంలోనే అధికార వ్యవస్థలను అమల్లోకి తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనలోని తియ్యదనాన్ని చవిచూపిస్తున్నారన్నారు. పాఠశాల ప్రిన్సిపల్‌ పడమట వెంకటేశ్వర్‌ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు సీహెచ్‌ జయరామ్, ఎస్‌.ప్రభావతి, ఎం.నిర్మల, సీహెచ్‌ ఆశయ్య, ఎస్‌.సుధాకర్‌రావు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను పర్యవేక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత కొమారి రాజు, సాక్షి బ్యూరో కె.కిషోర్, ఎడిషన్‌ ఇన్‌చార్జి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.   

గ్రామ సచివాలయాలపై ఇంకాఏమన్నారంటే...
ప్రభుత్వ  సంక్షేమ పథకాలైన పింఛన్లు, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటి స్థలం, పక్కాగృహం, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహాయాలు లబ్ధిదారులు ఎవరో అనేది సచివాలయాల్లో బోర్డుల్లో ప్రదర్శించడం వల్ల అర్హులు ఎవరు ఉన్నారో, అనర్హులు ఎవరు ఉన్నారో అందరికీ తెలిసి పోతుంది. ఇంతకాలం ఈ వ్యవహారం అంతా రహస్యంగా ఉండేది.
వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అందుబాటులోకి రావడంతో పింఛన్‌ కోసం, రేషన్‌కార్డు కోసం, ఇంటి స్థలం కోసం, పక్కాగృహం కోసం దళారులు లంచాలు డిమాండ్‌ చేసే దురావస్థ తగ్గిపోతోంది.
ఏ సమస్యను ఏ అధికారిని కలిసి చెప్పాలో, ఆ అధికారి కార్యాలయం ఎక్కడ ఉంటుందో, అధికారి ఎప్పుడు అందుబాటులో ఉంటారో సాధారణ ప్రజలకు తెలియదు. కానీ ఇప్పుడు ఇళ్ల వద్దకే వలంటీర్లు వచ్చి తెలుసుకుని, సచివాలయంలోని ఉద్యోగులకు తెలియజేసే అవకాశం వచ్చింది.
గ్రామాల్లో బాల్య వివాహాలు, కుటుంబ కలహాలు, సామాజిక రుగ్మతలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి సచివాలయంలో మహిళా పోలీసులు నియమించడం ద్వారా గ్రామాల్లో సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి దోహదపడుతుంది.
అక్రమ మద్యం, బెల్టు షాపులు తదితర అంశాలపై పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. వాటిని అరికట్టడానికి పేదల కుటుంబాల్లో నూతనోత్తజం వెల్లివిరియడానికి, గ్రామీణ కుటుంబాల్లో వికాసం ఆవిష్కరించడానికి గ్రామాల్లోని వలంటీర్లు, సచివాలయాలు పని చేస్తాయి.
ఎవరో వస్తారు ఏదో చేస్తారో అనే అస్తవ్యస్తమైన అధికార వ్యవస్థ లో సాధారణ ప్రజలకు సచివాలయాలు దిక్సూచిగా ఆవిర్భవించాయి.

మరిన్ని వార్తలు