‘సివిల్‌ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి’

25 Sep, 2019 16:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని, అందరికి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వివక్షను రూపుమాపవచ్చని అన్నారు. మెరుగైన విద్య లక్ష్యంతో కమిషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కోర్టు ఆదేశాల తరహాలో ప్రాసిక్యుషన్‌ చేసే విధంగా సివిల్‌ కోర్టు అధికారులు కూడా కమిషన్‌కు ఉంటాయని వెల్లడించారు. తమ ఆదేశాలను పాటించకుంటే ఇనిస్టిట్యూట్‌ కూడా రద్దు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలను కూడా కమీషన్‌ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. అనంతరం  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఈ కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్‌ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి  సభ్యులుగా ఉంటారు.

చదవండి : ఆంధ్రప్రదేశ్‌ కీలక పదవిలో జస్టిస్‌ ఈశ్వరయ్య

మరిన్ని వార్తలు