కోస్తాంధ్ర,తెలంగాణ మధ్య అల్ప పీడనం

10 May, 2014 09:40 IST|Sakshi

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కర్ణాటక తీరం నుంచి దిశ మార్చుకుని ఉత్తరకోస్తాపై కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర, తెలంగాణ మధ్య అల్పపీడనం కేంద్రీకతృమై ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అల్పపీడనం వల్ల తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురవగా రానున్న 24 గంటల్లో తెలంగాణతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని  అధికారులు తెలిపారు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు తెలిపిన అధికారులు  ప్రస్తుతమున్న అల్పపీడనం క్రమంగా తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా కదలి మరో 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయని వివరించారు.  

అల్పపీడనం బలహీనపడితే రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45- 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. మరోవైపు  భారీ వర్షాలకు సింగరేణిలో సుమారు లక్ష టన్నుల మేరకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. కాకినాడలో 15, నరసాపురంలో 9, గన్నవరంలో 9, విశాఖలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

>
మరిన్ని వార్తలు