నైతిక విలువలతో హక్కుల ఉల్లంఘన అదుపు

31 Mar, 2015 01:40 IST|Sakshi

జస్టిస్ కేజీ శంకర్
ఏఎన్‌యూ: నైతిక విలువలను పాటించడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టవచ్చని చెన్నైకి చెందిన డెబ్ట్స్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ కేజీ శంకర్ అన్నారు. యూనివర్సిటీ పీజీ డిపార్ట్స్‌మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ‘హ్యూమన్ రైట్స్ అండ్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ’ అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు సోమవారం యూనివర్సిటీలో ప్రారంభమయ్యింది. జస్టిస్ శంకర్ మాట్లాడుతూ వ్యక్తికి సమస్య వస్తే న్యాయస్థానాలను ఆశ్రయించాలా, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలా అనే దానిపై చాలామందికి అవగాహన లేదన్నారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి మాట్లాడుతూ కేవలం చట్టాల ద్వారానే కాకుండా మానవీయ కోణంలో కూడా వ్యక్తుల సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. వీసీ కె.వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రాథమిక హక్కులైన విద్య, ఆహారం, వైద్య హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్నారు.

ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నైతిక విలువలపై పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టాలన్నారు. కార్యక్రమానికి యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు. లా డీన్ వైపీ రామసుబ్బయ్య, విభాగాధిపతి ఎల్.జయశ్రీ ప్రసంగించారు. ఏపీ లా యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎ.సుబ్రహ్మణ్యం, పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు