ఎవరిదారి వారిది

14 Mar, 2014 03:03 IST|Sakshi

పార్టీ ఫిరాయింపులే కాదు..వర్గ విభేదాలూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తున్నాయి. నమ్మకంగా ఉన్న క్యాడర్‌ను దూరం చేస్తున్నాయి. కోడుమూరు నియోజకవర్గంలోనూ ఇదే జరిగింది. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉన్నవర్గమంతా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరిపోవటంతో కాంగ్రెస్ నాయకులు డీలాపడ్డారు.

ఏమీ చేయలేని స్థితిలో ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు బుధవారం అర్ధరాత్రి.. 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గూడూరు పట్టణంలో తన అనుచరులతో రహస్యంగా   అనుమతి  సమావేశమయ్యారు. గూడూరు, సి.బెళగల్ మండలాల్లోని మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యతిరేక వర్గీయులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.

‘కేంద్ర రైల్యేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దగ్గర మనకు విలువ లేదు, మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నా.... ప్రత్యర్థులను ఎదుర్కోలేక నిశ్చేష్టుడనయ్యా... మీకు న్యాయం చేయలేను.. మీ దారి మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అనుకూలించకపోతే నేను కూడా త్వరలో మీ వెంటే వస్తాను’ అని ఆ నాయకుడు తన అనుచరవర్గంతో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతటి స్థాయిలో ఉన్నా తనకు సరైన గౌరవం లభించడం లేదని ఆయన వాపోయారు.

కనీసం గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తనకున్న హోదాను గౌరవించడం లేదని.. అధికారులను అభివృద్ధిపై ప్రశ్నించే స్వేచ్ఛను కూడా కోల్పోయానని అనుచరులవద్ద ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. కోట్ల వర్గీయులు తనను పేరు పెట్టి పిలిచి ప్రజల ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారని, పదవి వాళ్ల నుంచి వచ్చిందనే చిన్నచూపు చూస్తున్నారని, ఎన్నాళ్లు అణిగిమణిగి బతకాలని  కార్యకర్తల దగ్గర వాపోయినట్లు తెలిసింది. గూడూరులో రాత్రి 12 గంటల నుంచి గంటన్నరసేపు కార్యకర్తలతో ఆ నాయకుడు నిర్వహించిన రహస్య భేటి సంచలనమైంది

. ప్రస్తుతం గూడూరులో జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో తన అనుచర వర్గీయులందరినీ ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయాలని సూచించినట్లు సమాచారం. ఐదారుగురు కౌన్సిలర్లు గెలిస్తే మనమే కీలకమవుతామని, మన సత్తాచాటాలని తన అనుచరులకు సూచించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు