స్థల సేకరణతో సరి!

27 Nov, 2015 00:58 IST|Sakshi
స్థల సేకరణతో సరి!

నరసరావుపేటలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాట్లు ప్రశ్నార్థకం
రెండేళ్లుగా ప్రారంభం కాని పనులు
శతాబ్ది వేడుకల కార్యక్రమాల్లోనూ కళాశాల ఊసెత్తని పాలకులు
ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు చేటు తెచ్చిందంటున్న స్థానికులు

 
నరసరావుపేట వెస్ట్ : జిల్లాలో విద్యాకేంద్రంగా విరాజిల్లుతున్న నరసరావుపేటలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్ధకంగా మారింది.  స్థల  సేకరణ చేయడం, జవహర్‌లాల్ నెహ్రూ    టెక్నలాజికల్ యూనివర్సిటీ అధికారులు పరిశీలన చేయడం రెండేళ్ల కిందటే పూర్తయినా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. పాలక పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు కళాశాల ఏర్పాటుకు చేటు తెచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.

నరసరావుపేట మున్సిపాల్టీ శత వసంతాల వేడుకలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో  నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి చేపట్టనున్నారు. రూ.300 కోట్లతో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని గతంలోనే శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల చేపట్టబోయే అభివృద్ధి పనులు, శంకుస్థాపల విషయాలను వెల్లడించారు. అందులో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల లేకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. స్పీకర్ డాక్టర్ కోడెల, ఎంపీ రాయపాటి మధ్య నరసరావుపేట నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అడ్డంకిగా మారిందని స్థానికంగా  ప్రచారం  జరుగుతోంది.

ఎంపీ ప్రకటన ఏమనట్టో..?
నరసరావుపేట మండలం కాకాని పరిసరాల్లో 2013 సంవత్సరం చివరిలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు 72 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. యూనివర్సిటీకి చెందిన అధికారులు సైతం వచ్చి స్థలాన్ని పరిశీలించారు. 2014 నుంచి కళాశాల ఏర్పాటుకు పనులు ప్రారంభిస్తామని, ఈలోగా నరసరావుపేట పట్టణంలో అద్దెకు భవనాలు తీసుకొని మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నందున జిల్లాకు ఒక మణిహారంగా ఉంటుందని స్థానిక విద్యార్థులు  భావించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీగా గెల్చిన రాయపాటి సాంబశివరావు నరసరావుపేటలోనే ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమౌతుందని ప్రకటించారు. కానీ 2015 విద్యాసంవత్సరం ముగిసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. అద్దె భవనాలు తీసుకోలేదు. నరసరావుపేట పట్టణ చుట్టుపక్కల తొమ్మిది ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలున్నా ఒకటి, రెండు మినహా ఏ కళాశాలలోను సరైన ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు లేవు. దీంతో స్థానిక విద్యార్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. స్థానికంగా ఉన్న కళాశాలల్లో విద్యార్థులు చేరకపోవడం, ప్రభుత్వం నుంచి సక్రమంగా ఫీజు రీయింబర్‌‌సమెంట్ రాకపోవడంతో పలు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను మూసివేయాలని భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఒకటి జిల్లాలో ఏర్పాటు కావడం మంచిదని ప్రైవేటు  కళాశాలల యజమానులు సైతం భావిస్తున్నారు.

విద్యార్థుల ఉత్సాహం ఆవిరి...
శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతుండగా వారిలో ఒకరితోనైనా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలకు శంకుస్థాపన ఉంటుందని ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ స్పీకర్ ఇటీవల ప్రకటించిన శంకుస్థాపన పనుల్లో ఇంజినీరింగ్ కళాశాల లేకపోవడం జిల్లా విద్యార్థులను నిరుత్సాహానికి గురి చేసింది. నియోజకవర్గంపై ఆధిపత్య పోరు చివరకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై పడిందని పలువురు భావిస్తున్నారు. ఆధిపత్య పోరును విడనాడి జిల్లా అభ్యున్నతికి పాటుపడాలని విద్యార్థులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు