సంక్షేమానికి కేటాయింపులతో సరి

16 Mar, 2017 03:15 IST|Sakshi

2017–18లో ఎస్సీల సంక్షేమానికి రూ.3,692.43
గిరిజనులకు రూ.1,815.32 కోట్లు
వెనుకబడిన తరగతులకు రూ. 5013.50 కోట్లు
గత బడ్జెట్ల నిధులు అంతంత మాత్రంగానే ఖర్చు

 
అమరావతి
: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత బడ్జెట్లతో పోల్చుకుంటే కేటాయింపులు పెరిగాయి. ఎస్సీల సంక్షేమానికి 2017–18 బడ్జెట్‌లో రూ.3,692.43 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే బడ్జెట్‌ కేటాయింపు 456.43 కోట్లు పెరిగింది. గిరిజన సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో రూ.1,815.32 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చుకుటే ఈ బడ్జెట్‌ కూడా రూ. 251.96 కోట్లు పెరిగింది. ఇక బీసీ సంక్షేమానికి 2016–17లో రూ.4,430.16 కోట్లు కేటాయించగా 2017–18లో రూ.5,013.50 కోట్లు కేటాయించారు. గత మూడు బడ్జెట్లను పరిశీలిస్తే ఎప్పటికప్పుడు కేటాయింపులు పెరుగుతున్నాయి. అయితే కేటాయించిన మేర ఖర్చు మాత్రం చేయడం లేదు. దీంతో బడ్జెట్‌ కేటాయింపులకు అర్థం లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గిరిజనానికి మొండిచెయ్యి
ఇక గిరిజన సంక్షేమానికి గత సంవత్సరం కేటాయించిన నిధుల్లో రూ.149.3 కోట్లు ఖర్చుకాలేదు. కేటాయింపులు భారీగా చూపించడం, నిధులు ఖర్చుచేయకుండా అంకెల గారడీకి ప్రభుత్వం పాల్పడుతున్నదనే విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామనే హామీ నెరవేరలేదు. 50 సంవత్సరాలు వయస్సు కలిగిన పేద గిరిజనులకు రూ.1,000ల పింఛన్‌ ఇస్తామనే హామీకీ దిక్కులేకుండా పోయింది. అలాగే గిరిజన జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు.

కులానికో హామీ
బీసీల సంక్షేమం విషయానికొస్తే కేటాయింపులకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్లు, అదనపు సదుపాయాలు కల్పిస్తామనే హామీ నెరవేరలేదు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆధార్‌తో అనుసంధానం లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కుల వృత్తులు, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి వృత్తి సముదాయాలు ఏర్పాటుచేసి వారి వృత్తి పనిముట్ల ఆధునీకరణకు నిధులు ఇస్తామనే హామీ కూడా కొండెక్కింది. గీత కార్మికులు, గొర్రెల కాపరులు, రజకులు, మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, ముదిరాజులు, తాపీపనివారు, గాండ్ల, సగర, ఉప్పర, పూసల, ఆరెకటిక, స్వర్ణకారులు, మేదర్లు, కుమ్మరులు, కలింగ కోమట్లు, గవర, కురుబ, పద్మశాలి, నాగవంశం, శిల్పులు, కమ్మరులు, వడ్రంగులు, మజ్జులు, దూదేకుల, మేర్‌ తదితర కులాలకు వేర్వేరుగా హామీలు గుప్పించారు. ఒక్కటి కూడా నెరవేరలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదు.

నెరవేరని హామీలు
ఎస్సీలు పరిశ్రమలు స్థాపించేందుకు రుణాలు భారీగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టినా.. సబ్సిడీని బ్యాంకుల్లోనే రుణం తీరేవరకు ఉంచడంతో ఈ పథకం నీరుగారింది. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను స్థాపించి ఎస్సీలు ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కృషిచేస్తామన్న హామీ నెరవేరలేదు. ఐదు కోట్ల వరకు ఎస్సీలకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ గాలికొదిలేశారు. భూమిలేని ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద భూమిని కొనిస్తామని ఇచ్చిన హామీ కూడా హామీగానే మిగిలిపోయింది.
http://img.sakshi.net/images/cms/2017-03/51489614687_Unknown.jpg
 

మరిన్ని వార్తలు