ఎవరెస్టు ప్రసాద్‌

16 Jun, 2018 09:22 IST|Sakshi
వరప్రసాద్‌

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వరప్రసాద్‌

పట్టుదలతో ముందడుగు

కఠోర శిక్షణలోనూ ఎంపిక

పట్టుదలతో పర్వతారోహణ పూర్తి

పల్లె యువకుడి సాహసం

ఒళ్లు కొరికే చలి..చుట్టూ మంచు గడ్డలు.. 8,848 మీటర్ల ఎత్తు..ఇదెక్కడో ఊహించే ఉంటారు. ఎవరెస్టు శిఖరం. అత్యంత     ఎత్తయిన పర్వతం..అధిరోహించాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఎంత సాహసం చేయాలి.. మూడు నెలలు కఠోరంగా కష్టపడి ఓ యువకుడు అనుకున్నది సాధించా డు. తాను కలలు గన్న ఎవరెస్టు ఎక్కి భారత పతాక ఎగురేశాడు. జిల్లాకు చెంది న వరప్రసాద్‌ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలాగో తెలుసుకుందాం..

చిత్తూరు రూరల్‌: చిత్తూరు రూరల్‌ మండలం పాలంతోపు గ్రామానికి చెందిన వరప్రసాద్‌కు తొలినాళ్ల నుంచి పర్వతారోహణపై విపరీతమైన ఆసక్తి..ఆ మక్కువే అతడ్ని ఎవరెస్టు శిఖరాలకు చేర్చింది.  నాగరాజు, జమున దంపతులకుమారుడు వరప్రసాద్‌  ఎంసీఏ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొండలెక్కడమంటే ఇష్టం.. గతేడాది సెట్విన్‌ (యువజన సర్వీసుల శాఖ) ఇచ్చిన ప్రకటన అతడ్ని ఆకట్టుకుంది. ఎవరెస్టు అధిరోహణకు ఆ శాఖ అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అధికారులు నవంబర్‌ 18న తిరుపతిలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శిక్షణ నిర్వహించింది. వరప్రసాద్‌ ఈ శిక్షణలో పాల్గొన్నాడు. రన్నింగ్, లాంగ్‌జంప్‌ వంటి విభాగాల్లో  ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.

శిక్షణ ఇలా...గత ఏడాది డిసెంబర్‌లో విజయవాడ సీబీఆర్‌ అకాడమి వద్ద జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో వరప్రసాద్‌ పాల్గొన్నాడు. ఐదు రోజుల పాటు జంగిల్‌ ట్రాకింగ్, రాక్‌ క్లైంబింగ్, వాల్‌ క్లైంబింగ్‌ వంటి విభాగాల్లో కఠోర శిక్షణ పొందాడు. మరో 40 మంది కూడా ఈ శిక్షణలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పొందారు. వీరంతా ఈ ఏడాది జనవరి 18న డార్జిలింగ్‌లోని హిమాలయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనింగ్‌లో 20 రోజుల పాటు మళ్లీ శిక్షణ పొందారు. ఇక్కడ ప్రతిభ చాటిన 20 మందిలో వరప్రసాద్‌ ఒకడు. దీంతో జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలోని పెహల్‌గామ్‌లో జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనింగ్‌ శిక్షణ కేంద్రానికి పంపించారు. పర్వతారోహణలో సాహసోపేత శిక్షణ పొందాడు. ఏప్రిల్‌ 20న చైనా ప్రాంతంలోని లాసాకు చేరుకున్నాడు.

అక్కడి నుంచిఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ చేరుకుని కొద్ది రోజుల పాటు ఎవరెస్ట్‌ ఎక్కుతూ, దిగుతూ వాతావరణ అనుమతుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మే 13న ఎవరెస్ట్‌ పర్వతారోహణ ప్రారంభించాడు. గతనెల 19 నాటికి 8,848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్‌ను ఎక్కి రికార్డు సృష్టించాడు. నాలుగు రోజుల్లోనే పూర్తిచేసి ఎవరెస్టు శిఖరానికి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేశాడు. జిల్లాలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన   తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఏఎస్పీ రాధికలతో పాటు పలువురు ఇటీవల వరప్రసాద్‌ను సన్మానిం చారు.  జూలై 5వ తేదీన సీఎం చేతుల మీదుగా వరప్రసాద్‌  రివార్డు, అవార్డు అందుకోనున్నాడు.

అందరి సహాయ, సహకారాలతోనే..
ఏదో ఒక రంగంలో రాణించాలనే పట్టుదల నన్ను ఎవరెస్టు ఎక్కేలా చేసింది.  అమ్మానాన్న బాగా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి విద్యతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించారు. సొంత ఊరివారు స్వాగతించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేను. ఇది ఒక మధురానుభూతి.     - వరప్రసాద్‌

మరిన్ని వార్తలు