రోజుకు రూ.40 కోట్లు!

3 Jan, 2014 01:25 IST|Sakshi

వైఎస్ హయూం తర్వాత ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారం
 
 సాక్షి, హైదరాబాద్: గత నాలుగేళ్లలో పన్ను పోట్లు, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇదిగో సంక్షేమం, అదిగో పథకం అంటూ హడావుడి చేస్తోంది. కోటి ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం ముగిసిన తర్వాత.. సంక్షేవు పథకాలకు కోత పెట్టడం, వీలైనంతగా కొత్త పన్నులతో బాదడానికే ప్రభుత్వాలు పరిమితమయ్యూరుు. గత నాలుగేళ్లను ఒక్కసారి పరికించి చూస్తే.. కఠోర వాస్తవాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్... ఇలా ఎన్నో సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టి వాటిని కొరగాకుండా చేసిన ప్రభుత్వం ఖజానా నింపుకోవటమే పనిగా పెట్టుకుంది. గత 50 నెలల కాలంలో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై ఎంత భారం మోపాయో లెక్కతీయుటానికి ‘సాక్షి’ ప్రయుత్నించినప్పుడు కళ్లు తిరిగే లెక్కలు తేలాయి. వ్యాట్, కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, వాహన పన్నులు, స్టాంపులు..రిజిస్ట్రేషన్లు తదితరాల రూపంలో ఏకంగా సుమారు రూ.60 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపింది. అంటే సగటున ప్రతినెలా రూ. 1,200 కోట్లు, రోజుకు రూ. 40 కోట్ల పెను భారం మోపింది.
 కరెంటు చార్జీలతో గుండెకోత
 
 వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా పేద  రైతులపై కరెంటు భారం ఉండదన్న ఉద్దేశంతో ‘ఉచిత కరెంటు’ పథకాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూరింది. మరోవైపు పరిశ్రమలకు యూనిట్‌పై సగటున 17 పైసలు చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 2009 సెప్టెంబర్‌లో రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య ఒక్కసారిగా కరెంటు చార్జీలను పెంచి భారీ భారాన్ని ప్రజల నెత్తిన మోపగా, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతియేటా చార్జీలు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేర, అసలు చార్జీలను మించి వసూలు చేయటం మొదలుపెట్టారు. ఇక ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రెండున్నర ఎకరాల మాగాణి (తరి) పొలం ఉన్న వారిని అందుకు అనర్హులుగా ప్రకటించారు. ఇలా లక్షన్నర మంది రైతులకు ఆ పథకాన్ని దూరం చేశారు. వెరసి రాజశేఖరరెడ్డి మరణానంతరం తర్వాత సర్దుబాటు చార్జీలు సహా కరెంటు బిల్లుల రూపంలో ప్రభుత్వం అదనంగా రూ. 24,218 కోట్ల భారాన్ని మోపింది.
 
 బస్సు చార్జీల మోత
 
 కరెంటు బిల్లుల తరహాలోనే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ వైఎస్ వ్యవహరించారు. ప్రజలపై భారం పడొద్దని తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వాటి జోలికే వెళ్లలేదు. ఆయన మరణానంతరం అడ్డూఅదుపూ లేకుండా చార్జీల మోత మోగించిన ప్రస్తుత ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1980 కోట్లమేర ప్రజల జేబుల నుంచి అదనంగా కొల్లగొట్టింది. చివరకు పేదల కోసం ఉద్దేశించిన పల్లెవెలుగు బస్సులనూ చార్జీల పెంపునుంచి మినహారుుంచలేదు.  
 
 వ్యాట్ వేటు..!
 
 ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా భావించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.55 వేల కోట్ల మేర పిండుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవటం దీనికి నిదర్శనం. అంతకుముందు సంవత్సరం కంటే ఏకంగా రూ.10 వేల కోట్ల మేర అధికంగా లక్ష్యాన్ని నిర్ధారించిన ప్రభుత్వం అవకాశం ఉన్న వస్తువునల్లా వ్యాట్ పరిధిలో చేరుస్తూ, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవాటిని 14.5 శాతం పరిధిలోకి తెస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. లక్ష్యాన్ని పెంచినా ఆదాయం సరిపోవటం లేదన్న కారణంతో వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని హీనపక్షంగా మరో రూ. 8 వేల కోట్లకు పెంచే యోచనలో ఉంది. 2008-09 వ్యాట్ లక్ష్యం రూ. 22,500  కోట్లు ఉంటే వైఎస్ దాన్ని మరుసటి యేడాదికి కేవలం వేయి కోట్లమేర మాత్రమే పెంచారు. కానీ ఆయన మరణించిన తొలి సంవత్సరంలోనే రోశయ్య ప్రభుత్వం ఏకంగా రూ. 29,144 కోట్ల లక్ష్యాన్ని పెడితే అది కాస్తా 2013-14 నాటికి రూ.55 వేల కోట్లకు పెరగటం విశేషం. ఈ విధంగా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజల నుంచి  ఏకంగా రూ.23 వేల కోట్లకుపైగా అదనంగా దండుకుంది.
 
 వాహన కొనుగోలుదారులకు వెతలు
 
 వాహన కొనుగోలుదారులనూ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ.2,300 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికమాంద్యం, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అభివృద్ధి మందగించడంతో రాష్ట్రంలో మోటారు వాహనాల విక్రయం నేల చూపులు చూస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. పన్నుల మోత మోగిస్తోంది. త్రైమాసిక పన్నుల జాబితాలో ఉన్న పలువాహనాలను జీవితపన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్నులు పెంచడం, రెండో వాహనం కొంటే గరిష్టంగా 14.5 శాతం పన్ను విధించడం.. తదితర చర్యల తో ప్రజల మీద భారం పెంచేసింది. తద్వారా రెండువేల కోట్లకు పైగా ఆర్జించింది.

 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల బాదుడు


ప్రభుత్వం ఆదాయం పెంపు కోసం స్థిరాస్తి కొనుగోలుదారులను కూడా పీల్చిపిప్పి చేసింది. 2009 - 10 ఆర్థిక సంవత్సరంలో  రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2012- 13 నాటికి రూ.6,600 కోట్లకు పెరగడం గమనార్హం. 2010లో ప్రభుత్వం భూములు, స్థలాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. 29 విభాగాలుగా ఉన్న భూములు, స్థలాలను కేవలం అయిదు కేటగిరీలుగా మార్చేసింది. పట్టణాల్లో అయితే వాణిజ్య, నివాస అనే రెండు వర్గీకరణలకే పరిమితం చేసింది. అప్పట్లో కొన్నిచోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలను 400 నుంచి 600 శాతం వరకూ పెంచింది. అందువల్లే 2009 -10లో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి 2010 -11 సంవత్సరంలో రూ.4,432 కోట్లకు పెరిగింది.

 

2013లో కూడా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు ఉన్న వ్యవసాయ భూములను కూడా ఇళ్ల స్థలాల వర్గీకరణలోకి మార్చింది. దీంతో వీటి కొనుగోలుదారులపై భారీ భారం పడింది. నగరపాలక, పురపాలక సంఘాల్లో గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ. 800 కోట్లు, మంచినీటిపై రూ. 200 కోట్ల భారాన్ని మోపింది. భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్లో రూ. 300 కోట్ల పెరుగుదల నమోదైంది. 

 

 

 
 

>
మరిన్ని వార్తలు