ధైర్యంగా చెప్పలేనివారు న్యాయమూర్తిగా పనికిరారు

10 Nov, 2013 03:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేనివారు న్యాయమూర్తి స్థానానికి అర్హులు కారని, కష్టమో.. నిష్టూరమో న్యాయమూర్తి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కానీ ఇటీవలి కాలంలో జూనియర్ జడ్జీలు యాదృచ్ఛికంగా సీనియర్ జడ్జీల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావును కౌండిన్య సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
 
 ఇతర వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నది నిజమే అయినా... అటువంటి పరిస్థితి సమాజానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతా పోస్టులకోసం సివిల్ సర్వీసు అధికారులు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితి న్యాయవ్యవస్థలోనూ ఉందని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. 1980 దశకంలో తనకు రాజకీయాలతో కొంత అనుబంధం ఉం దని... అధికారం ఉన్నప్పుడు పొర్లుదండాలు పెట్టినవారే అధికారానికి దూరమైన తర్వాత వారితో ప్రవర్తించే తీరు ను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలని, పదవులు శాశ్వతం కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యరిపై దాఖలైన పిటిషన్ విషయంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారని... జూనియర్ జడ్జిగా ఉన్నా ప్రధాన న్యాయమూర్తి తీర్పుతో విభేదించారని, చట్టాలపై లోతైన అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను చెప్పారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం చలమేశ్వర్‌దని, న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగినా ఆయన ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పూ రాలేదని చెప్పారు. చట్టాలపై లోతైన అవగాహన ఉన్న జస్టిస్ రామలింగేశ్వరరావు ప్రతిభతోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారని ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు అడ్వొకేట్ జనరల్ కేజీ కృష్ణమూర్తి, ఐటీ కమిషనర్ బాల గాని గోపీనాథ్, వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ జి.వెంకటేశ్వర్లు, కౌండిన్య సేవా సమితి ప్రతినిధులు నాగేశ్వరరావు, ఉయ్యూరు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు