యువతా మేలుకో..

9 Mar, 2014 03:22 IST|Sakshi

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఎన్నికల వేళ ఓటరు ప్రాధాన్యత పెరిగింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇతరులకు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఓటరుగా నమోదయ్యేందుకు వచ్చే నెల 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నెల 9వ తేదీని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ప్రకటించింది.
 
 18-19 ఏళ్ల యువతీ యువకుల ఓటరు నమోదు జిల్లాలో అతి తక్కువగా ఉంది. ఈ వయసు గ్రూపు యువతీ యువకులు దాదాపు 3 లక్షల మంది ఉండగా.. 71,577 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన వారంతా ఆదివారం పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటన్నిటిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంచాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని.. అందులో పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవచ్చన్నారు. ఒకవేళ లేకపోతే అక్కడే ఫారం-6 దరఖాస్తు పూర్తి చేసి అందజేయాలన్నారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
 

మరిన్ని వార్తలు