హిందుత్వ పరిరక్షణకు కృషి అవసరం

28 Oct, 2013 00:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు తిలోదకాలివ్వడం శోచనీయమని విశ్రాంత డీజీపీ అరవింద రావు అన్నారు. ఆదివారం ఇక్కడ అఖిల భారతీయ చాణక్య దళ్(ఏబీసీడీ) సమావేశంలో మాట్లాడుతూ హిందుత్వ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కోస్తా జిల్లాల్లో అత్యధికంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే హిందూ సమాజం పటిష్టంగా ఉంటుందన్నారు. అందరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. అఖిల భారతీయ చాణక్య దళ్ అధ్యక్షులు మురళీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ బ్రాహ్మణులను ఏకతాటిపై నడిపించే నేత కరువయ్యారన్నారు.

 

దేశంలో బ్రాహ్మణులను ఏకతాటిపైకి తెచ్చేందుకే తాము సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌సత్తా అధికార ప్రతినిధి గీతామూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణులు చట్టసభల్లోకి ప్రవేశిస్తేనే హిందుత్వ పరిరక్షణ సాధ్యమన్నారు. విప్ర సంఘం అధ్యక్షులు భగవాన్‌దాస్,  అఖిల భారతీయ చాణక్యదళ్ నేత కె.కృష్ణమాచారి, ధన్వంతరి ట్రస్టు చైర్మన్ డా. కమలాకర శర్మ, మల్లేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు