బ్రహ్మోత్సవాలు విజయవంతం

14 Oct, 2013 03:57 IST|Sakshi

సాక్షి, తిరుమల: ఓ వైపు సమైక్య ఉద్యమ హోరు.. మరో వైపు భక్తుల భక్తి పారవశ్యం..మధ్య అఖిలాండకోటి బ్రహ్మోండ నాయకుని బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగవైభవంగా ముగిశాయి. ఉదయం చక్రస్నానంలో సేద తీరిన శ్రీవారు, రాత్రి ధ్వజావరోహణంలో ఉత్సవాలకు ముగింపు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమైక్యాంధ్ర ఉద్యమ సెగలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగాయి.

తిరుమలకు వచ్చే భక్తులకు అడుగడుగునా ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా భక్తుల సంఖ్య, హుండీ కానుకలు తగ్గిపోయాయి.  వాహన సేవల్లో భక్తులు పలుచగా కనిపించినా గరుడవాహనంలో రెండున్నర లక్షల మంది పాల్గొనడం విశేషం. ఈసారి బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ఎక్కడా హడావిడిగా కనిపించలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు సాదాసీదాగా వ్యహరించారు.
 
కోలాహలంగా వాహన సేవలు
ఈ నెల 5వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వేడుకగా సాగాయి.
     
తొలి రోజు పెద్ద శేషవాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆఖరి రోజు తిరిచ్చివాహనంతో ముగిశాయి.
     
జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కారు సెల్వం, స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి వాహన సేవల ఊరేగింపుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు.
 
తగ్గిన భక్తులు .. హుండీ కానుకలు

 ఈ సారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిది రోజుల్లో మొత్తం 4లక్షలా 48వేల 416 మంది దర్శించుకున్నారు. ఈ సంఖ్య గతంలో కంటే 5.47 శాతం తగ్గింది.

 పటిష్ట భద్రత

 బ్రహ్మోత్సవాల్లో టీటీడీ సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, అర్బన్‌జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్‌పీ ఉమామహేశ్వర్ శర్మ, డీఎస్‌పీ నంజుండప్ప  పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

 సమష్టిగా చైర్మన్, ఈవో, అధికారులు

 ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు , టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో అశోక్‌కుమార్ నుంచి అటెండర్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బోర్డుల సభ్యుల హడావిడి ఏమాత్రం కనిపించలేదు. సభ్యుల్లో ఎల్‌ఆర్.శివప్రసాద్, లక్ష్మణరావు అన్ని వాహన సేవల్లో పాల్గొన్నారు.  

 హడావిడికి దూరంగా ఈవో

 టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ గత ఈవోలకు భిన్నంగా తనదైన శైలిలలో కనిపించారు. ఉత్సవాల్లో ఎక్కడా హడావిడికి అవకాశం ఇవ్వలేదు. ఇదే తరహాలోనే జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు కూడా కనిపించారు. చైర్మన్ బాపిరాజు మాత్రం సమైక్యసెగ ఉండడంతో ఈసారి ఉత్సవాల్లో ఎక్కడా సందడి చేయకుండా వాహనసేవలకే పరిమితమయ్యారు. జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో జీవీజీ అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్‌వో శివకమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించా రు. ఆలయ వ్యవహారాల్లో  డెప్యూటీ ఈవోలు చిన్నంగారి రమణ, గదుల కేటాయింపుల్లో ఎస్టేట్ ఆఫీసర్ దేవేంద్రరెడ్డి, తిరుమలను పరిశుభ్రంగా ఉంచడంలో హెల్త్ ఆఫీసర్ వెంకట్రమణ నిరంతరం జేఈవోకు అందుబాటులో ఉంటూ పర్యవేక్షించారు.
 
పుష్ప, ఫొటో ప్రదర్శన విద్యుత్ అలంకరణలు భేష్

 ఈసారి టీటీడీ ఉద్యానవన ం, విద్యుత్ విభాగాలు పోటీపడి అలంకరణ లు చేశాయి. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నేతృత్వంలో 25 టన్నుల పుష్పాలతో ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక వాహనసేవల్లో కూడా పూల అలంకరణలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచి భక్తులను మైమరింపించాయి. విద్యుత్ విభాగం ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, డీఈ  రవిశంకర్‌రెడ్డి రాత్రీపగలూ తేడా లేకుండా పని చేశారు. పుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్లకు భక్తుల నుంచి విశేష సందన లభించింది.
 

మరిన్ని వార్తలు