ఏలేరు ఆధునికీకరణకు రూ.295.82 కోట్లు

25 Apr, 2015 03:43 IST|Sakshi

- జీఓ నం : 241 విడుదల
- నెరవేరనున్న రైతుల కల
పిఠాపురం :
కొన్నేళ్లుగా ఏటా కోట్ల విలువైన పంటలు కోల్పోతున్న ఏలేరు రైతాంగం కష్టాలు తీరనున్నాయి. ఏలేరు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.295.82 కోట్లు విడుదల చేస్తూ జీఓ నం: 241ని శుక్రవారం విడుదల చేసింది. ఆరు మండలాల్లో సాగునీటికి ఆధారమైన ఏలేరు ఆధునికీకరణకు నోచుకోక గత కొన్నేళ్లుగా రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతోంది. కాలువలు పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఆక్రమణలకు గురికావడం, గట్లు బలహీనపడి కోతకు గురవడం వ ంటి సమస్యలు పీడిస్తున్నారు.

నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏలేరు కాలువల నిర్మాణం జరిగింది. ఏలేరు పరీవాహక ప్రాంతం 2,232 చదరపు కిలోమీటర్లు (862చదరపు మైళ్లు) ఉండగా,  128 కిలోమీటర్ల పొడవు, 27,325 హెక్టార్ల ఆయకట్టు (67,614 ఎకరాలు) కలిగి ఉంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల ఆయకట్టు సాగునీటికి ఆధారంగా ఏలేరు కాలువలు నిర్మించారు. ఏలేరు కాలువ ప్రాజెక్టు నుంచి ఏలేరు, నక్కలఖండి, గొర్రిఖండి, పెద ఏరు, చిప్పలేరు, తదితర పేర్లతో పిలువబడుతోంది. సాగునీటితో పాటు ఏలేరు అదనపు జలాలను సముద్రంలోకి తరలించడానికి ఏలేరు ప్రాజెక్టు నుంచి కొత్తపల్లి మండలం సముద్ర తీరం వరకు దీనిని నిర్మించారు.  

అన్నదాతల వెతలకు స్పందించిన వైఎస్
అయితే నిర్మించిన నాటి నుంచి పూర్తి స్థాయిలో ఆధునికీకరణ పనులు జరగక పోవడంతో ప్రాజెక్టుతో పాటు కాలువలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా సాగునీరు అందకపోవడంతో పాటు వరదలు వచ్చినపుడు పంటలు మునిగి పోవడం నిత్యకృత్యంగా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటనకు వచ్చినపుడు రైతాంగం సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన ఆయన ఏలేరు ఆధునికీకరణకు  రూ.138 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు శంకుస్థాపనసైతం చేశారు. అయితే ఆయన అకాల మృతితో ఆ పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో ఏలేరు మరింత శిథిలావస్థకు చేరుకుంది.

ఇటీవల ఏలేరు ప్రాజెక్టుతో పాటు తిమ్మరాజు చెరువు, ఏలేరు కాలువల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో కలిపి మొత్తం ఏలేరు పూర్తి ఆధునికీకరణకు రూ.308 కోట్ల వ్యయం కాగలదని నీటిపారుదల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎట్టకేలకు రూ.295.82 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే ప్రతిపాదించిన మొత్తంలో కొన్ని పనులు అవసరం లేదంటూ రూ.13 కోట్లకు కోత విధించింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా నిర్మించ తలపెట్టిన పెద్దాపురం ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం, పెద్దాపురం, పిడిమిదొడ్డి, కాండ్రకోట, దివిలి, నాగులాపల్లిలలో లస్కర్ క్వార్టర్ల నిర్మాణాలు అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొంది.

మరిన్ని వార్తలు