కౌంటింగ్‌కు కట్టుదిట్ట భద్రత

18 May, 2019 10:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ శిరస్సా వహించాల్సిందే. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఏవో రెండు, మూడు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగా నిర్వహించాం. ఇక ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా చేపడతాం. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెట్టాం. కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్‌ను సక్రమంగా నిర్వహించటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించారు. 
 

ప్రశ్న: జిల్లాలో ఎన్ని కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు ? 
ఎస్పీ : జిల్లాలో 15 అసెంబ్లీ, ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.  ఓట్ల లెక్కింపునకు ఏలూరు, భీమవరంలో నాలుగు కళాశాలల్లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏలూరులో సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాల, భీమవరంలో విష్ణు విద్యా సంస్థలు, సీతా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కౌంటింగ్‌ కేంద్రాలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. భీమవరంలో 7, ఏలూరులో 8 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. 
 

ప్రశ్న: సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు? 
ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 96 సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. ఓట్ల లెక్కింపు అనంతరం గత ఎన్నికల్లోనూ చాలా చోట్ల గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే సమస్యాత్మక గ్రామాల్లో ముందుస్తుగానే పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏలూరు, దెందులూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం. 
 

ప్రశ్న: కౌంటింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు ఏమిటి ? 
ఎస్పీ : ప్రధానంగా కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఎవ్వరూ సెల్‌ఫోన్‌ తీసుకురాకుండా చర్యలు చేపట్టాం. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్ళే కానిస్టేబుల్‌ నుంచి జిల్లా అధికారి వరకూ ఎవరూ సెల్‌ఫోన్స్‌ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. ఎన్నికల అబ్జర్వర్లు మాత్రమే సెల్‌ఫోన్‌ కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఇక సెల్‌ఫోన్లకు టోకెన్‌ సిస్టంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తున్నాం. పోలీసు అధికారులు నిర్దేశించిన ట్రాఫిక్‌ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. 
 

ప్రశ్న: కౌంటింగ్‌ ఏజెంట్లలో క్రిమినల్స్‌ ఏవరైనా ఉన్నారా ? 
ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారుల నుంచి కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితాను తీసుకుని వారిపై ఎమైనా క్రిమినల్‌ కేసులు ఉన్నాయా అని పరిశీలించాం. ఒక నియోజకవర్గంలో రౌడీషీటర్‌ ఉన్నట్లు గుర్తించి వెంటనే అధికారులకు నివేదించాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో 7 వేల మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశాం. వీరిలో 26 మందిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేశాం. ఇటువంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. 
 

ప్రశ్న:  ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టారు ?
ఎస్పీ : ఏలూరు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వరరావు, నరసాపురం కేంద్రాల వద్ద ఏఆర్‌ ఏఎస్పీ మహేష్‌కుమార్‌ను ప్రత్యేకంగా నియమించాం. జిల్లా వ్యాప్తంగా 67మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో పెట్రోలింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఇక పోలీస్‌ సబ్‌డివిజన్‌ అధికారులతో ప్రత్యేకంగా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నిర్ణయించాం. ఇక జిల్లాలో 3,500మంది పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు, ఒక కంపెనీ ఏపీఎస్పీ బలగాలనూ మోహరించేందుకు చర్యలు చేపట్టాం. 
 

ప్రశ్న: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత చర్యలు ?
ఎస్పీ : జిల్లాలో ఏలూరు, భీమవరం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్ళే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాం. దీనికోసం మెటల్‌ డిటెక్టర్లు, బాంబు స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశాం. ఎన్నికల కమిషన్‌ మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే తనిఖీలు అనంతరం లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కౌంటింగ్‌ కేంద్రం లోపల సైతం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మఫ్టీలో పోలీసు అధికారులను భద్రత కోసం నియమించేందుకు ఏర్పాట్లు చేశాం. 
 

ప్రశ్న: వాహనాలు పార్కింగ్‌కు ఏవిధమైన చర్యలు తీసుకున్నారు ? 
ఎస్పీ : ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులకు ఒక ప్రాంతంలోనూ, వీఐపీలు, సీని యర్‌ అధికారులు, ఆర్‌ఓలకు ప్రత్యేకంగానూ, ఏజెంట్లు, ఇతర వ్యక్తులకు మరోచోట వాహన పార్కింగ్‌కు స్థలాలను నిర్ణయించాం. ఏలూరులో రామచంద్ర ఇంజినీరింగ్‌ కాలేజీ సమీపంలో ట్రాఫిక్‌ డీఎస్పీ అధికారితో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. భీమవరంలో విష్ణు కళాశాల వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్‌ మళ్ళింపుకు చర్యలు తీసుకున్నాం. 
 

ప్రశ్న: యువత, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ? 
ఎస్పీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి.  అభ్యర్థుల ఓటమి, గెలుపులపై యువత, విద్యార్థులు, అభిమానులు సంయమనం పాటించాల్సి ఉంది. అనవసరంగా గొడవలు, కొట్లాటలకు దిగటం ద్వారా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే సూచనలు చేయటం జరిగింది. వారంతా నిబంధనలకు అనుగుణంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కౌంటింగ్‌ పూర్తి అయిన మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గెలిచిన అభ్యర్థులు సైతం నిబంధనల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తీసుకుని మాత్రమే ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు