అంతా చూస్తుంటారు..! జాగ్రత్త

14 Mar, 2019 14:45 IST|Sakshi

అధికారులూ ఎన్నికల నియమావళి పాటించాల్సిందే

ప్రజా ప్రతినిధులు నిర్వహించే సమావేశాలకు వెళ్తే కోడ్‌ ఉల్లంఘనే

ఎవరూ చెప్పలేదంటే వేటు తప్పదు  

సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: కోడ్‌.. జిల్లా అంతటా మార్మోగుతున్న పేరు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత సామాన్యుడి దృష్టంతా దీనిపైనే ఉంది. విగ్రహాలు, పోస్టర్లు, బ్యానర్ల విషయంలోనే కాదు అధికారుల కదలికలు సైతం ఈ కోడ్‌ పరిధిలోకే వస్తాయి. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి అధికార పార్టీ పాల్పడకూడదు.  

  • ఎన్నికల ప్రచారం కోసం తన అధికార హోదాని దుర్వినియోగం చేశారనే అభియోగం తలెత్తకుండా కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ చూసుకోవాలి. 
  • ఎన్నికల పనికి గానీ, ప్రచారానికి గానీ పాలనా యంత్రాంగాన్ని, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
  • అధికారంలో ఉండే పాలకులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ విశ్రాంత గృహాలు, బంగ్లాలు లేక ప్రభుత్వ వసతి సౌకర్యాలను వినియోగించుకోకూడదు. 
  • ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రభుత్వ ఖజానా, ప్రజాధనం వెచ్చింది ప్రకటనలు, సంక్షేమ పథకాల ఆర్టికల్స్‌ను ప్రచురించకూడదు. ఇవ్వకూడదు. 
  • ఎన్నికల కోసం పక్షపాత పూరితమైన రాజ కీయ వార్తల కవరేజీ ప్రచారం కోసం ప్రభుత్వం మాస్‌ మీడియాని ఉపయోగించి దుర్వినియోగానికి పాల్పడకూడదు. 
  • ఎన్నికల సంఘం నిర్వహణ తేదీలు ప్రకటించినప్పటి నుంచి మంత్రలు, ఇతర అధికారులు తమ విచక్షణా నిధుల నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయరాదు. 
  • ప్రభుత్వంలోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఎటువంటి అడహక్‌ నియామకాలుగాని, కమిటీలుగాని జరపరాదు.

అధికారులకు నియమావళి..

  • ప్రజాప్రతినిధులకు అధికారులు, ఉద్యోగులు ప్రోటోకాల్‌ పాటించకూడదు.
  • ప్రజాప్రతినిధులు వద్ద పీఏలుగా, పీఆర్‌ఓలగా, ఫోటోగ్రాఫర్లగా ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తిరిగి వారి సొంతశాఖల్లో రిపోర్ట్‌ చేయాలి.
  • జిల్లాలకు ప్రచారం కోసం వచ్చే సమయంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఆహ్వానం పలకడానికి వెళ్లకూడదు.
  • ప్రజాప్రతినిధుల నిర్వహించే సమావేశాలకు హాజరుకావడం కావడం వంటి పనులు అధికారులు చేయకూడదు. కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. 
మరిన్ని వార్తలు