భూమి లెక్కలు పెద్ద చిక్కులు

19 Apr, 2018 03:54 IST|Sakshi

రెవెన్యూ రికార్డుల్లో ఒక్కో పుస్తకంలో ఒక్కో తీరుగా..!

ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్‌ మధ్య గణాంకాల్లో భారీ అంతరం

33.54 లక్షల ఎకరాల తేడా

అడంగల్‌లో నమోదుకాని భూములు లక్షలాది ఎకరాలు 

రెవెన్యూ రికార్డుల అస్తవ్యస్తానికి నిదర్శనం

ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డుల సమస్య

పట్టించుకోని ‘రెవెన్యూ’.. తలలు పట్టుకుంటున్న రైతులు

పల్లెల్లో పెరుగుతున్న భూ వివాద ఘర్షణలు

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా పీలేరులో రహదారి పక్కనే ఒక సర్వే నంబరులో ఆరు ఎకరాల భూమి ఉంది. ముగ్గురి పేర్లతో ఈ భూమి ఉంది. నారాయణ స్వామి తనకు నాలుగు ఎకరాలు ఉందని చెబుతున్నారు. కృష్ణారెడ్డి తనకు రెండు ఎకరాలు, రమేష్‌ బాబు తనకు రెండు ఎకరాలు ఉందని చెబుతున్నారు. ఈమేరకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. ఉన్న భూమి ఆరు ఎకరాలైతే ముగ్గురి పేర్లతో కలిపి ఎనిమిది ఎకరాలుగా నమోదు అయింది. దీంతో అధికారులు వారి పేర్లతో భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయకుండా పక్కన పెట్టేశారు. దీంతో తాజా అడంగల్‌లో అధికారులు ఈ భూమి విస్తీర్ణం రాశారేగానీ ఎవరిపేరుతో ఎంత ఉందో నమోదు చేయకుండా ఖాళీలు పెట్టారు. 

ఇలాంటి భూ సమస్యలు ఈ ఊరు ఆ ఊరులో అనిలేదు. రాష్ట్రంలోని దాదాపు ప్రతి పల్లెలో భూ రికార్డుల్లో తేడాలతో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు చేతులెత్తేయడంతో వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని చోట్ల హత్యలకు కూడా దారితీసిందంటే ఈ భూ లెక్కల తేడాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు (టైటిల్‌డీడ్‌)లో మాత్రమే తప్పులు ఉంటే ఎలాగోలా సరిదిద్దవచ్చు. పకడ్బందీగా వివరాలు నిక్షిప్తం చేయాల్సిన రెవెన్యూ శాఖ రికార్డులు కూడా తప్పుల తడకలుగా, అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో ఈ సమస్య అటు అధికారులకు, ఇటు భూ యజమానులకు చిక్కులు తెచ్చిపెడుతోంది.

ఈ లెక్కల చిక్కులు విడదీయలేనంత స్థాయిలో ముడిపడ్డాయి. గత దశాబ్దన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తేడాలు వివాదాలకు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. భూయాజమాన్య హక్కు ఎవరిదనే విషయంలో ఏర్పడిన వివాదమే కొన్ని నెలల కిందట చిత్తూరు జిల్లాలో ఓ హత్యకు దారితీసింది. భూ వివాదాలకు సంబంధించి రాష్ట్రంలోని రెవెన్యూ కోర్టుల్లో 34 వేల కేసులు ఉండగా మెజిస్ట్రేట్‌ కోర్టులు, జిల్లా కోర్టులు, హైకోర్టులో వేలాది కేసులు నడుస్తున్నాయి. భూ వివాదాలు పల్లెల్లో శాంతి భద్రతలకు కూడా ముప్పుగా పరిణమించాయని పోలీసు అధికారులు ప్రభుత్వానికి నివేదించారంటే సమస్య తీవ్రత అర్థం అవుతుంది. 

33.54 లక్షల ఎకరాల తేడా
రాష్ట్రంలో సర్వే నంబర్ల వారీగా చూస్తే ఆర్‌ఎస్‌ఆర్‌ (రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌), అడంగల్‌ (భూమి హక్కుదారుల పట్టిక) మధ్య 33.54 లక్షల ఎకరాల విస్తీర్ణం మేరకు భూ వ్యత్యాసం ఉంది. మొత్తం భూ విస్తీర్ణంతో పోల్చితే ఇది 10 శాతం కావడం గమనార్హం. ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న సర్వే నంబర్ల కంటే అడంగళ్లలో ఉన్న చాలా సర్వే నంబర్లు ఎక్కువగా ఉంటాయి. అడంగల్‌లోని నంబర్లను అన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది. దశాబ్దాలుగా రైతుల అనుభవంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములు నేటికీ అడంగల్‌లో ఎక్కలేదు. వీటినీ పరిగణనలోకి తీసుకుంటే తేడా 40 లక్షల ఎకరాలు దాటవచ్చని అధికారులే అంగీకరిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో మొత్తం 41,81,147 సర్వే నంబర్లు ఉండగా అడంగల్‌లో 46,91,642 సర్వే నంబర్లు ఉన్నాయి. అనగా ఆర్‌ఎస్‌ఆర్‌లో కంటే అడంగల్‌లో 5.10 లక్షల సర్వే నంబర్లు అధికంగా (12 శాతం తేడా) ఉన్నాయి.  

ఎందుకిలా?
– వంశపారంపర్యంగా వచ్చిన భూముల విషయంలో కొందరు భాగ పరిష్కారం సమయంలో వాస్తవ భూ విస్తీర్ణం కంటే ఎక్కువగా తమ పేర్లతో నమోదు చేసుకున్నారు. 
– భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే సమయంలో కూడా చాలామంది వాస్తవం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
–  పొరుగున ఉన్న సర్కారు భూమిని ఆక్రమించుకుని కొందరు ఇలా రాయించుకోగా మరికొందరు పొరుగువారి భూమిని కూడా ఆక్రమించుకుని రికార్డుల్లో ఎక్కించుకున్నారు. 
 
ఆర్‌ఎస్‌ఆర్‌ ఆంటే
రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిష్టర్‌ను ఆర్‌ఎస్‌ఆర్‌ అంటారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం భూమిని సర్వే చేసిన సందర్భంగా తయారు చేసిన రికార్డు. బ్రిటీష్‌ హయాంలో జరిగిన ఈ రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌నే చాలా వరకూ రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుంటుంది. అయితే ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఆర్‌ కాపీలనే లేకుండా చేశారు. కొన్నిచోట్ల మాన్యువల్‌గా మార్పు చేర్పులు చేశారు. అందువల్ల ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం సమస్యను పరిష్కరించాలన్నా వీలు కావడంలేదు.

సమస్య పరిష్కారం ఎలా?  
ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి గతంలో లాగా మళ్లీ భూములన్నింటి రీసర్వే చేయడం ఉత్తమం. ఇది భారీ డబ్బు ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కావడంతో ప్రభుత్వం ఇందుకు సిద్ధంగాలేదు. అందువల్ల సర్వేనెంబర్ల వారీగా భూ అనుభవదారులతో రెవెన్యూ అధికారులు సమావేశమై చర్చించి వాస్తవ భూ విస్తీర్ణం మేరకు అనుభవదారులందరూ వాటాలు పంచుకునేలా ఒప్పించి ఆ మేరకు రికార్డుల్లో మార్చాలి. అయితే ప్రభుత్వం స్పందించడంలేదు.

భూమి శుద్ధి ఏదీ?
మొత్తం భూ రికార్డులను శుద్ధి (భూ రికార్డుల ప్రక్షాళన/ మ్యుటేషన్‌) చేస్తామని చంద్రబాబు సర్కారు ప్రకటించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నమే లేదు. ఇలాంటివి సరిచేయకుండా పట్టాదారు పాసుపుస్తకాలను రద్దుచేసి (విలువ లేకుండా చేసి) తమకు అన్యాయం చేసిందని రైతులు వాపోతున్నారు. దీనివల్ల తమకు బ్యాంకు రుణాలు అందడంలేదని, భూమి అమ్ముకోవాలన్నా వీలుకావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా భూ రికార్డుల్లో తేడా ఉన్న విషయం వాస్తవమేనని దీనిని సరి చేయడం పెద్ద కసరత్తుతో కూడుకున్నదని వివరించారు. 

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన అప్పల నరసింహానికి నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ మేరకు ఆయనకు పట్టాదారు పాసుపుస్తకం కూడా ఉంది. ఆయన తన పేరును అడంగల్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. వాస్తవంగా ఆయనకు పొలం ఉన్న సర్వే నంబరులో 20 ఎకరాలు ఉంది. ఇందులో అప్పల నరసింహంతోపాటు నలుగురు భాగస్వాములు ఉన్నారు. ఆ నలుగురి పట్టాదారు పాసుపుస్తకాల ప్రకారం ఈ సర్వే నంబరులోని భూమి విస్తీర్ణం 23 ఎకరాలు కాగా వాస్తవంగా ఉన్న భూమి 20 ఎకరాలు మాత్రమే. అందువల్లే ఎవరి పేరునూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయలేదు. ఎవరికెంత భూమి అన్నది మీరే తేల్చుకోండని రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకున్నారు.  

మరిన్ని వార్తలు