ఆహారమేదీ...!

22 Jan, 2014 03:05 IST|Sakshi

స్త్రీ..గర్భిణిగా మారిన దగ్గరనుంచీ ఎన్నో జాగ్రత్తలు. పుట్టబోయే పాపాయి ముద్దుగా, బొద్దుగా ఉండాలని అనేక ప్రణాళికలు.దీనికి బలమైన తిండి, పండ్లు, వైద్యుల సహాయం, కుంకుమ పువ్వు , డ్రైఫ్రూట్స్ వగైరా..వగైరా ఇవి ఉన్నవారి లోగిళ్లలోనే. ఏ పూటకాపూట గడవడమే గగనమయ్యే పేద ఇళ్లల్లోని వారికో..ప్రభుత్వం సమకూర్చాలి. లేకుంటే వారే ఏ పాట్లో పడాలి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ తరగతుల చెందిన కాబోయే అమ్మల పరిస్థితి ఇదే. వారికోసం ఉద్దేశించిన పథకాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. ఆచరణలో.. ఆరడుగుల దూరంలో ఉంటోంది. ఇదీ జిల్లాలోని దుస్థితి..యంత్రాంగం పట్టించుకోని తీరు...
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ అమృత హస్తం పేరిట మహిళలకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామంటూ అధికారికంగా లెక్కలు చూపుతున్నా.. వాస్తవం భిన్నంగా ఉం ది. జిల్లాలోని చాలా మంది పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఎదగాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా.. ఈ మధ్యే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తె చ్చిన పౌష్టికాహార కేంద్రాల ఊసే లేకుండా పోయింది. మాతా శిశు మరణాల నివారణ చర్యల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ జనాభా 70 శాతం ఉన్న ఆవాస ప్రాంతాల్లో పోషకాహార కేంద్రాలను నెలకొల్పేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా దళిత వాడల్లో జనవరి నుంచి పోషకాహార కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 927 కేంద్రాల్లో అమలు కానున్న ఈ కార్యక్రమంలో రోజుకు రూ. 10 చెల్లిస్తే రెండు పూటలా పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని గర్భిణులకు, బాలింతలకు ఈ కేంద్రాల్లో అందజేస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణను డీఆర్‌డీఏ అధికారులకు అప్పగించారు.
 
 మన జిల్లాలో అమృత హస్తం అమలవుతోంది కాబట్టి పోషకాహార కేంద్రాలు ఏమాత్రం అవసరం లేదంటూ.. ఇక్కడి అధికారులు ఎస్సీ, ఎస్టీ పేదలకు పోషకాహారం ప్రాప్తించకుండా చేశారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై ఇప్పటికే హైదరాబాద్ సెర్ఫ్ అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో మన జిల్లాను ఎంపిక చేయకపోవడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

 అచ్చంపేట ప్రాంతంలో..!
 గతేడాది జనవరి 1న ప్రారంభించిన ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలు ఏడాది గడవక ముందే అథోగతి పాలైంది. జిల్లాలోని 19 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 4423 అంగన్‌వాడీ కేంద్రాలు, 605 మినీ అంగన్‌వాడి కేంద్రాల ద్వారా అమలు జరగాల్సిన ఈ పథకం అధిక సంఖ్యలో చెంచులు, గిరిజనులు నివసించే అచ్చంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ ప్రభుత్వ పరంగా పౌష్టికాహారం అందించడం అంతంత మాత్రమేనని, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అప్పుడప్పుడు అందిస్తుంటారని, చెంచులు అభిప్రాయపడుతున్నారు.
 
 మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార స్థాయిని పెంచేందుకు, తక్కువ బరువు గల పిల్లల జననాలు నిరోధించేందుకు, గర్భిణుల్లో రక్తహీనతను నిర్మూలించడంతోపాటు, మానసిక వైకల్యంతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించేందుకు  ఉద్దేశించిన ఈ పథకం లక్ష్యాలు  చేరడం లేదు. ప్రతీ గర్భిణికి, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐఎఫ్‌ఏ మాత్రలు అందిస్తామని, సంబంధిత విభాగాలు చెబుతున్నప్పటికీ... వారి సేవలు అంతంత మాత్రమేనని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు.
 
 పథకం అమలుపై నీలి నీడలు
 ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుపర్చేందుకు జిల్లాలో 1000 గ్రామాలను ఎంపిక చేశారు.  అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ మహిళల్లో వెయ్యి మందిలో 18 మంది వంతున ఏటా సుమారు 20,700 మంది తల్లులయ్యే భాగ్యాన్ని పొందుతున్నారని అంచనా.. కానీ వీరికి సరైన పోషకాహారం అందక, అవగాహన లేక నెలకు సుమారు నాలుగుకు తక్కువ కాకుండా ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయి.
 
 అలా చూస్తే ఏటా సుమారు 48 మంది బాలింతలు గానీ, గర్భిణులు గానీ మరణిస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలను అధిగమించి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఎస్సీ, ఎస్టీ జనాభా 70 శాతం దాటిన ప్రాంతాల్లో  రూ.10 చెల్లిస్తే పోషకాహారాన్ని అందజేసే విధంగా పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనను జిల్లాలో అమలుపర్చకపోవడం ఇబ్బందిగా మారింది.  
 
 కేంద్రాల ఏర్పాటు ఇలా..
 ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా పౌష్టికాహార కేంద్రాలను జిల్లాలో నడిపే బాధ్యతను డీఆర్‌డీఏ అధికారులు తీసుకుని.. వారి పర్యవేక్షణలో.. ఆహారం వండివడ్డించే బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. ఇప్పుడు గిరిజనులు, దళితుల జనాభాతోపాటు మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రంలోని.. మన జిల్లాను ఎంపిక చేయకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ పథకంలో భాగంగా ఉదయం సమయంలో గుప్పెడు మొలకెత్తిన విత్తనాలు, 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక పండు, మధ్యాహ్నం ఆకుకూర, పప్పు, ఇగురుకూర, మజ్జిగతో భోజనం అందిస్తారు. రాత్రి వేళలో అయితే కూర, రసంతో కూడిన భోజనం ఉంటుంది. దీంతోపాటు నెలకోసారి ఉచితంగా వైద్య సేవలు, సలహాలు అందించేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.
 

మరిన్ని వార్తలు