స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై సందేహాలు వద్దు: ద్వివేది

24 Apr, 2019 15:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్‌ రూమ్‌ సమీపంలోని కంట్రోల్‌ రూమ్‌లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని ద్వివేది కొట్టిపారేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని, పుకార్లను ప్రచారం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ద్వివేదిని కలిసిన మేరుగ నాగార్జున
కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ....సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. వేమూరు నియోజకవర్గంలో అకృత్యాలు, దాడులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీ రౌడీలపై పెట్టిన కేసుల్లో పురోగతి లేదని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. బాధ్యులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని అన్నారు. దళితులపైనా, అండగా నిలిచిన ఇతర కులస్తులపైనా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. 

అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్‌నే సవాల్‌ చేస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియతోపాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు అండ్‌ కో పై ఎన్నికల కమిషన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులని చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు.

మరిన్ని వార్తలు