ఓటింగ్‌ యంత్రాలు.. వచ్చేశాయ్‌!

17 Feb, 2019 08:49 IST|Sakshi
స్వర్ణభారతి స్టేడియంలో పరిశీలనకు ఉంచిన ఈవీఎంలు, వీవీప్యాట్లు

విశాఖకు చేరుతున్న ఈవీఎంలు, వీవీప్యాట్‌లు

స్వర్ణభారతి స్టేడియంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

సిబ్బందికి, రాజకీయ నేతలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు

సాక్షి, విశాఖపట్నం: కళ్లెదుట కనిపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రాథమిక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు మొదలైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సిబ్బంది బదిలీల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ మొదలు తహసీల్దార్ల వరకు కొత్తవారే వచ్చారు. ఈ ప్రక్రియ ముగిశాక ఇప్పుడు ఇతర కార్యక్రమాలపై ఎన్నికల కమిషన్‌ దృష్టి పెట్టింది. వీటిలో భాగంగా పోలింగ్‌లో కీలకమైన ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు), వాటికి అనుసంధానించి ఉండే ఇతర ఉపకరణాలను జిల్లా కేంద్రానికి తరలించే పని మొదలైంది. 

ఎన్నికల సన్నాహాల్లో భాగంగా విశాఖకు  12,967 ఈవీఎంలు, 10,130 సీయూలు, 10,941 వీవీపీఏటీలు చేరాయి. ఈవీఎంల పనితీరుపై సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలకు అనుసంధానంగా వీవీపీఏటీ (ఓటు నిర్ధరణ యంత్రాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు ఏ గుర్తుపై వేశామో తెలుసుకోవచ్చు. వీవీ ప్యాట్స్‌ ద్వారా ఎవరికి ఓటు వేశామో వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏడు సెకన్లపాటు ఈ వివరాలు ప్యాట్‌పై ప్రత్యక్షమవుతాయి. వీటిని వినియోగించడం ఎన్నికలలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీఎంలకు ఈ సౌకర్యం లేదు. వీవీప్యాట్‌లకు అనుసంధానంగా  ఉన్న ఈవీఎం లను మాత్రమే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించనున్నారు. అవసరమైన మేరకు వీవీపీఏటీలను రప్పిస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. బ్యాలెటింగ్‌Š యూనిట్, కంట్రోలింగ్‌ యూనిట్, వీవీ ప్యాట్, నిర్వహణ గురించి ఈ శిక్షణలో వివరిస్తారు.ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ పనితీరును తెలుపుతారు.

తనిఖీల ప్రక్రియ మొదలు
ఈవీఎంలు, వీవీపీఏటీల పనితీరును పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు కేటాయించిన ఈవీఎంలు, వీవీ పాట్స్‌ చేరగా, వీవీ ప్యాట్స్‌ తనిఖీ ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ద్వారా మాక్‌ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో పటిష్టమైన బందోబస్తు మధ్య ఎన్నికల కమిషన్‌ నుంచి వచ్చిన ప్రత్యేక ఇంజనీర్ల పర్యవేక్షణలో వీటిని తనిఖీ చేస్తున్నారు. వీటి పనితీరును పరిశీలించేందుకు రాజకీయ పార్టీల నేతలకు కూడా అనుమతినిచ్చారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఈవీఎంల పనితీరును పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లాకో టెక్నికల్‌ నోడల్‌ అధికారిని నియమించనున్నారు.మరో వైపు పోలింగ్‌ సిబ్బంది, రిటర్నింగ్‌ అధికారులు, వ్యయ పరిశీలన, వెబ్‌కాస్టింగ్‌ వంటి బృందాల నియామక ప్రక్రియ కూడా మొదలైంది. జనవరి 11న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోంది.

తొలి రోజు తనిఖీలు
భెల్‌ నుంచి 30 మంది ఇంజినీర్లు, 50 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈవీఎంల తనిఖీల్లో పాల్గొన్నారు. తొలిరోజు 400 కంట్రోల్‌ యూనిట్లు, 400 బ్యాలెట్‌ యూనిట్లు, 172 వీవీ ప్యాట్స్‌లను పరిశీలించారు. డీఆర్వో గున్నయ్య, జేసీ 2 వెంకటేశ్వర రావు, జెడ్సీ సీఈవో రమణమూర్తి, కలెక్టరేట్‌ డీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షించారు.

ఇతర ఏర్పాట్లు
జిల్లాలో పెరిగిన ఓటర్లకనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల పెంపు, అవసరం లేని చోట కుదింపు, ప్రాంతాల మార్పు ప్రక్రియ కూడా పూర్తయింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామక ప్రక్రియ చేపట్టారు.ఈసారి 4052 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఆమేరకు వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ర్యాంపులు, మంచినీరు, విద్యుత్, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటి నుంచే దృష్టి సారిం చారు.

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కె.భాస్కర్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలకు సంబంధించి నోడల్‌ అధికారులను త్వరలోనే నియమించనున్నట్టు తెలిపారు. సెక్యూరిటీ ప్లాన్, కమ్యూనికేషన్‌ ప్లాన్‌లను త్వరలో తయారు చేస్తామని తెలిపారు. సమావేశంలో జేసీ–2 వెంకటేశ్వరరావు, డీఆర్వో గున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు