మాజీ సీఎంలకు మినహాయింపు లేదు

17 Jun, 2019 03:55 IST|Sakshi
దామోదర్‌

విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీ చేయడంపై రాద్ధాంతం సరికాదు

కంట్రోలర్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ ఐజీ ఇ.దామోదర్‌ 

సాక్షి, అమరావతి: విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీల్లో మాజీ ముఖ్యమంత్రులకు మినహాయింపులేదని, చంద్రబాబును తనిఖీ చేయడంపై వాస్తవాలు తెలుసుకోకుండా రాద్ధాంతం సరికాదని ఐపీఎస్‌ అధికారి, కంట్రోలర్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ ఐజీ ఇ.దామోదర్‌ చెప్పారు. ఈ విషయమై ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను మూడున్నరేళ్లు ఏవియేషన్‌ వీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన అనుభవంతో ఏవియేషన్‌ సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ) చికాగో కన్వెన్షన్‌లోని 17వ అనుబంధం ప్రకారం సభ్యదేశాలు అన్నీ నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఐరాస సభ్య దేశమైన భారత్‌లో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు.

స్వతంత్ర సంస్థ అయిన స్టాండర్డ్స్‌ అండ్‌ రికమండెడ్‌ ప్రాక్టీసెస్‌ (ఎస్‌ఏఆర్‌పీఎస్‌) నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలకు 36/2005 సర్క్యులర్‌ కూడా జారీ అయిందని గుర్తు చేశారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రులకు, జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన వారికీ కూడా విమానాశ్రయాల్లోకి ప్రవేశించే ముందు తనిఖీల నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఆమె కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసి మాజీ ముఖ్యమంత్రులకు భద్రతాపరమైన తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినా ఫలితం లేదని చెప్పారు. బీసీఏఎస్‌ తరహాలోనే నిబంధనలు పాటించే అమెరికాలోని ట్రాన్స్‌పోర్టు సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (టీఎస్‌ఏ) నిబంధనల మేరకు అక్కడి విమానాశ్రయంలో గతంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాంను తనిఖీ చేశారని వివరించారు.

అమెరికాలోని టీఎస్‌ఏ నిబంధనల ప్రకారం కేబినెట్‌ సెక్రటరీ అయినా, అమెరికాకు చెందిన అత్యున్నత మిలట్రీ అధికారులైనా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు లేదని చెప్పారు. అలాగే మన దేశంలోని ఏ విమానాశ్రయంలోనైనా నిబంధనల ప్రకారం సోదాలు జరుగుతాయన్నారు. విమానాల సొంత యజమానులు అయినా, ప్రైవేటు ఆపరేటర్లు అయినా లోపలికి వెళ్లే ప్రతీసారి సీఐఎస్‌ఎఫ్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది తనిఖీలు చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం సోదాలు చేసిన గన్నవరం విమానాశ్రయంలోని సిబ్బందిని అభినందించాల్సిందిపోయి దాన్ని రాద్ధాంతం చేయడం అవగాహనలేమే అవుతుందన్నారు. మీడియా సైతం వాస్తవాలను గమనించి ప్రచారం చేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు సరికాదని ఐజీ దామోదర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు